నారి నారి నడుమ మురారి రివ్యూః శర్వానంద్‌ ఖాతాలో హిట్టు పడింది

Nari Nari Naduma Murari Movie Review Sharwanand’s Festive Family Entertainer Wins Hearts

ఇటీవల కాలంలో వరుసగా ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన శర్వానంద్… ఈ సంక్రాంతికి మాత్రం తన అసలైన బలమైన జోనర్‌ను గుర్తు పెట్టుకుని రంగంలోకి దిగాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా, శర్వా ఖాతాలో మరో డీసెంట్ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. శబ్దం లేకుండా వచ్చి నవ్వులతో థియేటర్లను నింపేసిన సినిమా ఇది.

సంక్రాంతి సీజన్ అంటేనే కుటుంబ ప్రేక్షకులకు పండుగ. ఈసారి బరిలోకి దిగిన ఐదు సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే కావడం విశేషం. అలాంటి పోటీ వాతావరణంలో, ఎలాంటి ఆర్భాటం లేకుండా సాయంత్రం షోతో థియేటర్లలో అడుగుపెట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’… మెల్లగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

టీజర్, ట్రైలర్‌లు చూసినప్పుడు ఇది కూడా ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కుకున్న హీరో కథే అనిపిస్తుంది. కానీ సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆ అంచనాలు మారిపోతాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు… రొటీన్ టెంప్లేట్‌ను తీసుకుని, దానికి తనదైన ఫన్ టచ్ జోడించి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అబద్ధంతో మొదలైన ఒక బంధం ఎలా నిజం ముందు నిలబడుతుంది అన్నదే ఈ కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్.

గౌతమ్‌గా శర్వానంద్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపించాడు. ఇంజినీరింగ్ చదివి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే యువకుడిగా, ప్రేమలో పడ్డప్పుడు ఎలా ఉంటాడో… సమస్యలు ఎదురైతే ఎలా తడబడతాడో… అన్నింటినీ సహజంగా చూపించాడు. గత సినిమాల్లో కనిపించిన సీరియస్ షేడ్స్ కాకుండా, ఈసారి పూర్తిగా ఫ్యామిలీ హీరో మోడ్‌లోకి వచ్చాడు శర్వా.

ఇక ఇద్దరు హీరోయిన్ల విషయానికి వస్తే… దియగా సంయుక్త మీనన్, నిత్యగా సాక్షి వైద్య ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఒకరు పరిపక్వత కలిగిన క్యారెక్టర్‌లో మెప్పిస్తే, మరొకరు సాఫ్ట్ & లవబుల్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. శర్వా – హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సహజంగా నవ్వు తెప్పిస్తాయి.

ఈ సినిమాకు నిజమైన ప్లస్ పాయింట్ మాత్రం నరేష్. హీరో తండ్రిగా ఆయన చేసిన పాత్ర సినిమా మొత్తాన్ని మోస్తుంది. తెరపై కనిపించిన ప్రతి సీన్‌లోనూ నవ్వులు పూయిస్తూనే, ఒక విభిన్నమైన పాత్రను ప్రేక్షకుల ముందు నిలబెట్టారు. ఆయన పాత్రను చూస్తుంటే… నవ్వాలో, తిట్టాలో అర్థం కాక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. నిజానికి సినిమాకు బలమైన బ్యాక్‌బోన్‌గా నిలిచింది నరేష్ పాత్రే అనడం అతిశయోక్తి కాదు.

వెన్నెల కిషోర్, సునీల్, సత్య లాంటి కామెడీ ఆర్టిస్టులు తమ పాత్రల పరిధిలో సినిమాకు మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా అతికించినట్టు కాకుండా, సిచ్యువేషన్ ఆధారంగా వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. గెస్ట్ రోల్‌లో వచ్చిన శ్రీ విష్ణు పాత్ర క్లైమాక్స్‌కు కీలకంగా మారి కథకు సరైన ముగింపు అందించింది.

దర్శకుడు రామ్ అబ్బరాజు కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథల్లో సాధారణంగా ఒకరికే అన్యాయం జరిగేలా చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అందరికీ న్యాయం జరిగేలా కథను ముగించడం కొత్తగా అనిపిస్తుంది. కోర్టు సీన్‌తో వచ్చే క్లైమాక్స్ ప్రేక్షకులను సంతృప్తిపరుస్తుంది.

టెక్నికల్‌గా కూడా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. పాటలు సాదాసీదాగా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా సహకరించింది. నిర్మాత అనీల్ సుంకర పెట్టిన నమ్మకం వమ్ము కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.

మొత్తంగా చెప్పాలంటే… ‘నారీ నారీ నడుమ మురారి’ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కి వెళ్లి, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూసి రావడానికి సరైన సినిమా. శర్వానంద్ తన బలమైన ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ను మళ్లీ గుర్తు చేసుకున్నాడనే చెప్పాలి. సంక్రాంతి పండుగకి చివరగా వచ్చిన ఈ సినిమా… చివరి బంతికి సిక్సర్ కొట్టినట్టు ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *