చీర అంటే భారతీయ మహిళ మనసుకు ఎంతో దగ్గరైన వస్త్రం. ఇది కేవలం దుస్త్రమే కాదు… మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. తరతరాలుగా భారతదేశంలో చీరకు ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. దేశీయులే కాదు, విదేశీయులకూ భారతీయ చీరలపై ప్రత్యేక ఆకర్షణ పెరగడంతో ఇప్పుడు చీరలు ఫ్యాషన్ ప్రపంచంలోనూ విలువైన సంపదగా మారాయి. సాధారణ చీరలతో పాటు, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖరీదు చేసే అద్భుతమైన చీరలు కూడా ఉన్నాయి. వాటి ధరలు వింటే నిజంగానే కళ్లు బైర్లు కమ్ముతాయి.
బెంగాల్‌కు చెందిన జమ్దానీ చీరలు మొఘల్ కాలం నాటి వారసత్వాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నాయి. సన్నని పట్టు, బంగారు దారాలతో నేసే ఈ చీరల్లో కనిపించే పూల డిజైన్లు చూడగానే మంత్రముగ్ధులను చేస్తాయి. కర్ణాటక గర్వంగా చెప్పుకునే మైసూర్ సిల్క్ చీరలు స్వచ్ఛమైన పట్టుతో, బంగారు అంచులతో నేయబడతాయి. వడయార్ రాజవంశం కాలం నుంచి ఇవి రాజసిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్నాయి.
గుజరాత్‌లోని పటాన్ ప్రాంతానికి చెందిన పటోలా చీరలు డబుల్ ఇకత్ టెక్నిక్‌తో నేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. మహారాష్ట్రకు చెందిన పైథానీ చీరలు నెమళ్లు, తామర పువ్వుల డిజైన్లతో కళాత్మకతకు పరాకాష్టగా నిలుస్తాయి. తమిళనాడులో నేసే కాంచీపురం పట్టు చీరలు ‘పట్టు రాణి’గా పేరొందాయి. వీటి బలమైన నెయ్యడం, ఘనమైన డిజైన్లు వివాహాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
వారణాసికి చెందిన బనారసి చీరలు బంగారం, వెండి జరీతో నేయబడుతూ, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక తమిళనాడుకు చెందిన ఒక వివాహ పట్టు చీర అయితే ఏకంగా గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు, రత్నాలతో అలంకరించిన ఆ చీర విలువ కోట్లలో ఉంటుంది. ఈ ఖరీదైన చీరలు డబ్బుకే కాదు, భారతీయ కళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి.