తారక్ పక్కనుంటే రైడ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తా: రామ్ చరణ్

Ram Charan Confirms Peddi Release Date and Shares Fun Moment About NTR Driving

‘పెద్ది’ అంటూ ఫస్ట్ షాట్‌తోనే అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ఆ తర్వాత ‘చికిరి చికిరి’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.

ఇటీవల ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. సినిమా వాయిదా పడుతుందన్న ప్రచారానికి చెక్ పెడుతూ రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్… మార్చి 27న ‘పెద్ది’ కచ్చితంగా థియేటర్లలోకి రానుంది అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో తాను ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నానని చెప్పడంతో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది.

ఈ ఇంటర్వ్యూలో సరదాగా అడిగిన ఓ ప్రశ్నకు చరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో మీ స్నేహితుల్లో ఎవరు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని రైడ్‌ను ఆస్వాదిస్తారు? అని అడగ్గా… చరణ్ వెంటనే ఎన్టీఆర్ (తారక్) పేరు చెప్పారు.
“తారక్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చోవడం ఫుల్ ఎంజాయ్‌మెంట్. ఆయన చాలా క్రేజీ, మ్యాడ్ డ్రైవర్” అంటూ నవ్వుతూ చెప్పారు. తారక్ డ్రైవింగ్ చేస్తుంటే తనతో పాటు మరికొందరు స్నేహితులు ఎదుర్కొన్న సరదా అనుభవాలను కూడా తనతో షేర్ చేశారని చరణ్ వెల్లడించారు.

ఇక తన వ్యక్తిగత జీవితంపై కూడా చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నేను ఫెయిల్యూర్ అయినా, సక్సెస్ అయినా ఎక్కువగా మనసుకు తీసుకోను. ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోకుండా బ్యాలెన్స్‌గా ఉండటానికే ఇష్టపడతాను” అని తెలిపారు.

ఇదిలా ఉండగా, ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ పాట ప్రస్తుతం రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఈ సాంగ్‌పై 3 లక్షలకు పైగా రీల్స్, 8 లక్షలకు పైగా యూట్యూబ్ షార్ట్స్ రూపొందించారట. మొత్తంగా ‘చికిరి’ సాంగ్‌కు 2 మిలియన్ లైక్స్ రావడం విశేషం.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పాటతోనే దేశవ్యాప్తంగా బజ్ తెచ్చుకున్న ‘పెద్ది’… రిలీజ్ దగ్గర పడే కొద్దీ అంచనాలను మరింత పెంచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *