హైదరాబాద్ అంటేనే ఆకాశాన్ని తాకే భూముల ధరలు, కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనే భావన బలంగా తీసుకుంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగం కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా మారిన పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో భూముల ధరలు సామాన్యుడి ఊహలకు అందని స్థాయికి చేరాయి. కోకాపేట, నార్సింగి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఎకరం భూమి ధర వంద కోట్లను దాటడం ఈ వాస్తవానికి నిదర్శనం.
ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇదే. చదరపు గజం ధర రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు నగర పరిధిలో సొంత ఇల్లు కొనాలనే కల కలగానే మిగిలిపోతుందనే భావన ఏర్పడింది. అయితే ఇప్పటికీ హైదరాబాద్‌లో ఒక ప్రాంతం ఉంది… అక్కడ రూ.50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ దొరికే అవకాశం కనిపిస్తోంది.
ఆ ప్రాంతమే ఘటకేసర్. వరంగల్ హైవేకు సమీపంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డెవలపర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ 100 నుంచి 120 చదరపు గజాల్లో నిర్మించిన ఇండిపెండెంట్ ఇళ్లు రూ.50 లక్షల నుంచి ప్రారంభ ధరలో లభ్యమవుతున్నాయి. అంతేకాదు, గేటెడ్ విల్లాలు, అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు కూడా వేగంగా నిర్మాణంలో ఉన్నాయి.
ఘటకేసర్, బీబీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యాసంస్థలు, పరిశ్రమలు, వైద్య సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రి ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. నగరానికి సరైన కనెక్టివిటీ ఉండటం, భవిష్యత్‌లో మెట్రో, ఇతర మౌలిక వసతుల విస్తరణపై ఆశలు ఉండటంతో, ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో మంచి రెసిడెన్షియల్ హబ్‌గా మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు, హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఘటకేసర్ ఒక ఆశాజనక ఎంపికగా మారుతోంది.