శనివారం కాకినాడలోని వాకలపూడిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారితో కలసి ఏఎం గ్రీన్ సంస్థ వారి గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

అనంతరం జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
“గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక అడుగు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఏఎం గ్రీన్ ఎనర్జీ ముందుకు రావడం ఆనందందాయకం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024.
ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్య కేంద్రంగా, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి హబ్‌గా తీర్చిదిద్దబోతోంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది.

గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోనే మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో చారిత్రక మైలురాయిగా అభివర్ణించవచ్చు.
“బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు శ్రీ చలమలశెట్టి అనిల్ గారు నిరూపించారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయి.

2027 ఏడాది చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా, పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధ ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవస్థాపకులు అయిన శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, శ్రీ మహేష్ గారికి అభినందనలు తెలియజేసారు.