తెలంగాణ మున్సిపల్, ఆరు కార్పోరేషన్లకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు సిద్దమౌతుండగా… మరో పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఆ పార్టీ మరేదో కాదు. ఇటీవల 2024లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బరీలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటన కొన్ని పార్టీలకు ఆనందాన్ని ఇచ్చేదైతే…మరికొన్నింటికి ఇది మింగుడుపడని అంశంగా మారింది.
హైదరాబాద్‌లో పోటీకి సై
జనసేన పార్టీకి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మంచి పట్టు ఉంది. తెలంగాణలో ఎక్కువ మంది యువత పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే మద్దుతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే, తెలంగాణలో ఆ పార్టీ ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. కానీ, ఇప్పుడు ఏపీలో వచ్చిన కిక్‌తో తెలంగాణలోనూ తన ఉనికిని చాటుకోవాలని అనుకుంటుంది. తెలంగాణలో పార్టీ ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనే కంటే, ఒకసారి పోటీ చేస్తేనే సత్తా ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది.
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసి విజయం సాధించాయి. అయితే, ఏపీలో ఉన్న పరిస్తితులు, అక్కడి రాజకీయ సమీకరణాలు వేరు. కానీ, తెలంగాణలో సమీకరణాలు వేరు. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారణం వెనుకబాటుతనం. పరాయి పాలన. ఏపీ నుంచి వచ్చిన వ్యక్తులు తెలంగాణలో ప్రాబల్యం చూపుతున్నారని, వారే పరిపాలకులుగా ఉన్నారనే భారీ ప్రచారం, మన తెలంగాణ మనకు కావాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి పదేళ్లు దాటిపోయింది. ఇంకా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.
సెంటిమెంట్‌కి సెండాఫ్
ఇప్పుడు కావలసింది సెంటిమెంట్ కాదని ఇప్పటికే తెలంగాణ ప్రజలు నిర్ధారించారు. రెండుదఫాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి మూడోసారి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించారు. దీంతో తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌ను పక్కన పెట్టేశారు అన్నది క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చిన జనసేన పార్టీ ఈసారి మునిపల్ ఎన్నికలతో బరిలోకి దిగాలని చూస్తున్నది. అయితే, తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అన్నది తెలియాలి.
బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. అయితే, బీజేపీ జాతీయ పార్టీ కావడంతో ఒంటరిగా పోటీ చేయాలని రాష్ట్రం నిర్ణయించినా…తుదిగా నిర్ణయం తీసుకోవలసింది జాతీయ నాయత్వమే. అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కేంద్రం స్థాయిలో జనసేన పార్టీకి మంచి పేరు ఉన్నది. కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే జనసేనతో కలిసి ముందుకు సాగక తప్పదు. లేదు అంటే జనసేన ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తుంది.
గ్రామస్థాయిలో బలపడాలంటే?
ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే… పార్టీకి గ్రామస్థాయిలో పెద్దగా కార్యకర్తలు, సంస్థాగతంగా బలం లేదు. కాబట్టి పట్టణాలు, నగరాల్లో మాత్రమే తొలిగా పోటీ చేయాల్సి ఉంటుంది. అందునా భాగ్యనగరంలోపైనే జనసేన ప్రధానంగా దృష్టిసారించే అవకాశం ఉంటుంది. భాగ్యనగరం కార్పోరేషన్లో జనసేన తన ఉనికిని చాటుకొని కొన్ని వార్డుల్లో విజయం సాధించిన పార్టీకి మంచిదే. తొలి అడుగు ప్రారంభమైనట్టే. 2028 నాటికి తెలంగాణలోనూ కొంత పట్టు సాధించే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన కొన్ని స్థానాల్లో విజయం సాధించినా… ఏపీ పార్టీ అయినా తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు అని తెలిస్తే చాలు… తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో జెండా పాతేందుకు పావులు కదుపుతుంది. పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇవన్నీ జరగాలి అంటే మొదట తెలంగాణలో ఏపీ పార్టీని ఆదరిస్తారా లేదంటే తిరస్కరిస్తారా అన్నది చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయం బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం ఏపీనుంచి వచ్చిన వారుండే ప్రాంతాల్లో మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివశించే బస్తీలపై కూడా జనసేనాని ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం నిర్వహిస్తేనే ఇదంతా సాధ్యమౌతుంది.