తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క–సారలమ్మలను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని, తొలి మొక్కును భక్తిశ్రద్ధలతో సమర్పించారు. రాష్ట్ర ప్రజల తరఫున దేవతలకు మొక్కులు చెల్లిస్తూ, సంప్రదాయాలను పాటిస్తూ సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ముందుగా మేడారం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి పాల్గొన్నారు. సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఆధునికీకరించిన గద్దెల ప్రాంగణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులు భక్తులకు మెరుగైన అనుభూతిని అందిస్తాయని సీఎం పేర్కొన్నారు.
అనంతరం, కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క–సారలమ్మకు మొక్కును చెల్లించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా, తన మనవడితో కలిసి తులాభారంలో వనదేవతలకు 68 కిలోల బెల్లాన్ని సమర్పించడం భక్తులను ఆకట్టుకుంది. ఈ తులాభారం కార్యక్రమం ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తుల జయజయధ్వానాల మధ్య సాగింది. సంప్రదాయానుసారం బంగారానికి ప్రతీకగా భావించే బెల్లాన్ని దేవతలకు సమర్పిస్తూ, రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని సీఎం ఆకాంక్షించారు.
మేడారం సమ్మక్క–సారలమ్మలను తెలంగాణ ప్రజలు వనదేవతలుగా, ఆదిశక్తిగా పూజిస్తారు. అటువంటి పవిత్ర స్థలంలో సీఎం స్వయంగా కుటుంబంతో కలిసి మొక్కు చెల్లించడం, తులాభారం నిర్వహించడం రాష్ట్రంలో భక్తి, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతను మరోసారి చాటింది.