వందలాది కుక్కలను ఒకేసారి చంపడం అన్యాయం అని టాలీవుడ్ నటి రేణు దేశాయ్ అన్నారు… ఇందాకే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేయడం చాల తప్పు అని, అలాగే తనకి పాలిటిక్స్ లోకి వెళ్లడం ఇంటరెస్ట్ లేదని కూడా స్పష్టం చేసింది…
ఇంతకీ రేణు ఎం మాట్లాడింది అంటే… ‘‘సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరూ ఎందుకు స్పందించడం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచి వందల కుక్కలను చంపడం అమానవీయం కాదా. కుక్కలవి మాత్రం ప్రాణాలు కాదా? కుక్కే కాదు.. ఆవు, గేదె, పిల్లి, కోతి అన్నీ కూడా ప్రాణులే కదా?. మనుషులతోపాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది. వీధి కుక్కల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులే. ఇంటా, బయటా చెత్త పేరుకుపోవడం వల్లే కుక్కలు పెరుగుతున్నాయి. అందుకు కారణమైన సమస్యలపై ఎవరూ స్పందించరు. కానీ, కుక్కల గురించే మాట్లాడతారు.. ఇదెక్కడి న్యాయం’’.

‘‘2019లో దోమ కాటు వల్ల నాకు డెంగీ వచ్చింది. చనిపోయినంత పని అయింది. ప్రభుత్వం అప్పుడు దోమల నివారణకు ఏం చేసింది. ఇటీవల వందల కుక్కలను చంపి వాటి పక్కన ఫొటోలు దిగారు. నిద్ర లేచిన దగ్గర నుంచి కాలభైరవుడిని పూజిస్తారు. మరోవైపు కుక్కలను చంపుతారు. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు. ఎవడో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడని మగవాళ్లందరినీ చంపేయలేం కదా. నేను ఇలా మాట్లాడినందుకు నన్ను జైలులో పెట్టనివ్వండి. ఫర్వాలేదు.. నేను చూసుకోగలను. ఈ దేశంలో ప్రతీది డబ్బుతో ముడిపడి ఉంది. బైకులు ఢీ కొట్టడం వల్ల రోజుకు వందల కుక్కలు గాయపడుతున్నాయి. అవి ఎవరి దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేయాలి’’.
‘‘దోమల కాటు వల్ల లక్షల మంది చనిపోతున్నారు. వాళ్ల ప్రాణాలంటే లెక్క లేదా. ఈ ప్రెస్మీట్ వల్ల నాపై నెగెటివిటీ పెరుగుతుందని నాకు తెలుసు. అసభ్య పదాలతో తిడతారు. అయినా నేను భయపడను. దీనివల్ల కనీసం ఒక్కరైనా మారతారని నా ఆశ. ఈ సమస్య గురించి బయటకు వచ్చి మాట్లాడకపోతే ఆ భగవంతుడు క్షమించడు. ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి. అవి పూర్తిగా విఫలం కావడం వల్లే కుక్కలు పెరిగిపోతున్నాయి. వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. విదేశీ బ్రీడ్స్ పెంచుకునే యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి’’.
అలాగే తనకు పాలిటిక్స్ లోకి వచ్చే ఇంటరెస్ట్ లేదు అని చెప్తూ… ‘‘ఓ 55 ఏళ్ల వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నాపై గట్టిగా కేకలు వేశాడు. నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. అతడితో మాత్రమే నేను కోపంగా మాట్లాడాను. ఈ విషయాన్ని నా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దయచేసి అలా మాట్లాడకండి’’ అని వీడియో లో రేణు దేశాయ్ చెప్పింది!