తెలంగాణ రాజకీయాలు మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కావడంతో, ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల వరకే పరిమితం కావు. ఇవి రాజకీయ పార్టీలకు పవర్ మీటర్, పబ్లిక్ మూడ్ ఇండికేటర్, భవిష్యత్ రాజకీయ దిశను సూచించే ఎన్నికలుగా మారబోతున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, గత పాలక పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ — ఈ మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతోంది. దీనికి తోడు, తొలిసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అడుగు పెట్టాలని చూస్తున్న జనసేన పార్టీ అంశం రాజకీయ వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకత ఏమిటి?
మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా రాష్ట్ర లేదా జాతీయ ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ
- అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్
- స్థానిక సమస్యలు
- అభివృద్ధి పనులు
- సామాజిక సమీకరణలు ఎక్కువ ప్రభావం చూపుతాయి.
కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే తొలి పెద్ద ఎన్నిక. అందుకే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ పరీక్షగా మారుతోంది.
అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం… కానీ సవాళ్లు కూడా
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిస్థాయి పాలన చూపించే స్థాయికి చేరలేదు. అయినప్పటికీ,
- ఆరు గ్యారంటీల అమలు
- సంక్షేమ పథకాల ప్రారంభం
- పాలనలో మార్పు ప్రయత్నాలు.
వీటిని చూపిస్తూ ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే “మేమే ఇప్పుడు ప్రభుత్వం” అనే అడ్వాంటేజ్. స్థానికంగా నిధులు, అభివృద్ధి పనులు త్వరగా వస్తాయన్న ఆశతో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశముంది.
కానీ మైనస్ పాయింట్ కూడా ఉంది.
- ఇంకా పూర్తిగా ఫలితాలు కనిపించలేదు
- ఆశలు ఎక్కువగా ఉన్నాయి
- గ్రామీణ స్థాయిలో మద్దతు ఉన్నా, పట్టణాల్లో అసంతృప్తి కొంత ఉంది
అందుకే కాంగ్రెస్‌కు ఇది సులభమైన ఎన్నిక కాదు. అయినా సరే, పెద్ద పట్టణాల్లో కాకపోయినా, మధ్యస్థ మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్: ఓటమి తరువాత పునరాగమనం కోసం ప్రయత్నం
బీఆర్ఎస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో చాలా కీలకం. పదేళ్ల పాలన తరువాత ఓడిపోయిన పార్టీగా, “మేమే అభివృద్ధి చేశాం” “కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదు” అనే వాదనతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు రెండో ఛాన్స్ లాంటివి. ముఖ్యంగా,
- పట్టణ ప్రాంతాల్లో
- గతంలో బీఆర్ఎస్ బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో
- పార్టీ క్యాడర్ బలంగా ఉన్న చోట్ల
బీఆర్ఎస్ మంచి పోటీ ఇవ్వగలదు.
అయితే, పార్టీకి ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే అధికారంలో లేని పార్టీగా ఉండటం. కొంత మేర యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా కొనసాగడం. అయినా సరే, కాంగ్రెస్‌పై అసంతృప్తి పెరిగితే, దాని లాభం నేరుగా బీఆర్ఎస్‌కే వెళ్లే అవకాశం ఎక్కువ.
బీజేపీ: నగరాలపై ఆశలు… కానీ పరిమితులు
బీజేపీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను చాలా వ్యూహాత్మకంగా చూస్తోంది.
- గ్రేటర్ హైదరాబాద్
- కొన్ని ప్రధాన పట్టణాలు
- మధ్యతరగతి, యువ ఓటర్లు.
ఇవే బీజేపీ టార్గెట్ గ్రూప్.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం” “కేంద్ర నిధులు” అనే నినాదాలను బలంగా వినిపిస్తోంది.
కానీ బీజేపీకి ఉన్న పరిమితి ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టులేమి, స్థానిక స్థాయి నాయకత్వం కొరత. అందుకే బీజేపీ ఈ ఎన్నికల్లో విజేతగా కాకపోయినా, కీలక శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.
జనసేన ఎఫెక్ట్: ప్రభావం ఎంతవరకు?
ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న తెలంగాణలో జనసేన పార్టీ అడుగుపెడితే ఏం జరుగుతుంది?
జనసేనకు తెలంగాణలో పెద్దగా సంస్థాగత బలం లేదు. కానీ,
- పవన్ కళ్యాణ్ అభిమానులు
- యువతలో ఉన్న క్రేజ్
- “కొత్త రాజకీయాలు” అనే ఇమేజ్
ఇవన్నీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే, వాస్తవ రాజకీయంగా చూస్తే…. జనసేన గెలిచే అవకాశాలు చాలా పరిమితమే. కానీ ఓటు షేర్‌ను చీల్చే పాత్ర మాత్రం ఉంటుంది. ముఖ్యంగా,
- బీజేపీకి వెళ్లే ఓటు
- కొంత మేర కాంగ్రెస్ యాంటీ ఓటు
వీటిని జనసేన ఆకర్షించే అవకాశం ఉంది.
ఏపీ పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా?
ఇది చాలా కీలకమైన ప్రశ్న. తెలంగాణ ఉద్యమం తరువాత, “మన రాష్ట్రం – మన పార్టీలు” అనే భావన బలంగా ఉంది. అందుకే ఏపీ కేంద్రంగా ఉన్న పార్టీలపై సహజంగా కొంత సందేహం ఉంటుంది. అయినా సరే, స్థానిక సమస్యలపై ఫోకస్ చేస్తే, అభ్యర్థులు స్థానికులే అయితే, కొంత మేర ఆదరణ దక్కే అవకాశం ఉంది. కానీ అది వేవ్ స్థాయిలో ఉండదు.
సెంటిమెంట్ ఫ్యాక్టర్: ఎంత ప్రభావం?
ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ పాత్ర పూర్తిగా తేలిపోదు.
- ప్రభుత్వంపై ఆశ
- మార్పు కోరుకునే భావన
- గత పాలనపై పోలిక
ఈ మూడు అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా, “ఇంకో అవకాశం ఇవ్వాలా?” “మళ్లీ పాత పార్టీ వైపు వెళ్లాలా?”… అనే అంతర్గత చర్చ ఓటర్లలో కనిపించనుంది.
మొత్తంగా చూస్తే… కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు మంచి ఫలితాల ఇచ్చే పోటీ అని చెప్పాలి. అయితే, బీఆర్ఎస్ కి రికవరీ మోడ్‌లో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. బీజేపీ ఎప్పటిలాగే నగరాల్లో తన ప్రభావాన్ని చూపించవచ్చు. చివరిగా జనసేన పార్టీ మార్జినల్‌గా ప్రభావం చూపినా తెలంగాణలో చర్చనీయాంశంగా మారడం ఖాయం. అయితే, రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తాయని చెప్పొచ్చు. తెలంగాణ ప్రజల మూడ్ ఎలా ఉంది… 2029లో ఓటర్లు ఎటువైపు తమ చూపులు ఉన్నాయన్నది స్పష్టమౌతుందని చెప్పొచ్చు.