ఈ మాట కొత్తగా ఉండొచ్చు. కానీ, నిజం ఇదే. ఒకచోట భారీ ఎత్తున సంపద పుడుతుంది…కానీ, బలవంతుడు దానిని లాగేసుకుంటున్నాడు. సంపదను వెలికి తీసే ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. చేతుల్లో ఉన్నా అది నోటివరకు వెళ్లడం లేదు. ఇది ఆఫ్రికా కథ.
ఆఫ్రికా అంటేనే పేదరికం, ఆకలి, యుద్ధాలు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ నిజానికి ఆఫ్రికా భూమి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఖండాల్లో ఒకటి. బంగారం, వజ్రాలు, చమురు, కోబాల్ట్, యురేనియం, అరుదైన ఖనిజాలు. ప్రపంచ పరిశ్రమలకు ప్రాణంగా ఉన్న వనరులన్నీ ఆఫ్రికాలోనే ఉన్నాయి.
అయినా…ప్రపంచంలోని అత్యంత వెనుకబడిన దేశాల జాబితాలో ఎక్కువగా ఆఫ్రికా దేశాలే ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, ఆఫ్రికా గతం, వర్తమానం, అంతర్జాతీయ రాజకీయాల్ని ఒకేసారి చూడాలి.
ఆఫ్రికా పేద ఖండం కాదు – దోపిడీకి గురైన ఖండం
ఆఫ్రికా సమస్య వనరుల కొరత కాదు. వనరులపై హక్కు లేకపోవడమే అసలు సమస్య. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో లభించే కోబాల్ట్ లేకుండా ఈరోజు స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఊహించలేం.
ఘానాలో లభించే బంగారం ప్రపంచ మార్కెట్లలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది.
కానీ ఈ వనరుల లాభం ఆఫ్రికా ప్రజలకి చేరడం లేదు. గనులు, చమురు క్షేత్రాలు, ఖనిజ పరిశ్రమలు …ఇవన్నీ ఎక్కువగా విదేశీ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆఫ్రికా ముడి పదార్థాలను ఎగుమతి చేస్తుంది.
విలువైన ఉత్పత్తులు మాత్రం విదేశాల్లో తయారవుతాయి. లాభం అక్కడే నిలిచిపోతుంది.
కాలనీవాదం: ముగిసిందనుకున్న దోపిడీ
15వ శతాబ్దం నుంచి యూరప్ దేశాలు ఆఫ్రికాను ఆక్రమించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, బెల్జియం లాంటి దేశాలు ఆఫ్రికాను వనరుల గోదాముగా మార్చాయి.
ఆ కాలంలో:
- పరిశ్రమలు నిర్మించలేదు
- విద్యా వ్యవస్థలు బలంగా ఏర్పాటు చేయలేదు
- స్థానిక పాలనను అభివృద్ధి చేయలేదు
వనరులు తీసుకెళ్లడమే లక్ష్యంగా రైల్వేలు, పోర్టులు నిర్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆఫ్రికా దేశాలు ఆర్థికంగా స్వతంత్రం కాలేకపోయాయి. కాలనీవాదం రాజకీయంగా ముగిసినా, ఆర్థిక కాలనీవాదం కొనసాగింది.
యూరప్ గీసిన సరిహద్దులు – అంతర్గత కలహాలకు కారణం
ఆఫ్రికా మ్యాప్‌ను గమనిస్తే చాలా దేశాల సరిహద్దులు సహజంగా ఉండవు. అవి యూరప్ దేశాలు తమ సౌలభ్యం కోసం గీసిన గీతలు. దీంతో…
- ఒకే తెగ వేర్వేరు దేశాల్లో విడిపోయింది
- శత్రుత్వం ఉన్న తెగలు ఒకే దేశంలో కలిసిపోయాయి
ఇలా తమకు నచ్చినట్టుగా…భవిష్యత్తులో ప్రమాదాలకు తావునిచ్చేవిధంగా విభజించారు. ఫలితం…
- పౌర యుద్ధాలు
- తిరుగుబాట్లు
- రాజకీయ అస్థిరత
ఈ పరిస్థితుల్లో అభివృద్ధి జరగడం చాలా కష్టం.
సంపదే శాపంగా మారిన ‘రిసోర్స్ కర్స్’
సహజ సంపదలు ఉన్న దేశాలు త్వరగా అభివృద్ధి చెందాలి అనిపిస్తుంది. కానీ ఆఫ్రికాలో మాత్రం అది శాపంగా మారింది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా ఇంకా వెనకబాటుతనం పెరిగిపోవడానికి ప్రధాన కారణాలు యుద్ధాలు. ఒక దేశంలో పదేళ్లకు ఒకమారు యుద్ధం జరిగితే… అభివృద్ధి చెందటానికి సమయం ఎక్కడి నుంచి వస్తుంది. ఆఫ్రికాలో ప్రధాన సమస్య ఇదే.
నైజీరియా:
- చమురు సంపదలో అగ్రస్థానం
- కానీ నిరుద్యోగం, కాలుష్యం, అవినీతి ఎక్కువ
కాంగో:
- ఖనిజ సంపద అపారం
- కానీ బాల కార్మికులు గనుల్లో పనిచేస్తున్నారు
సంపద సులభంగా దొరికితే పాలకులు ప్రజలపై ఆధారపడరు. దీంతో అవినీతి పెరుగుతుంది, ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది.
విద్య లేకపోవడం – అసలు మూలకారణం
చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు సహజ వనరుల వల్ల కాదు…విద్య, నైపుణ్యాలు, పరిశ్రమల వల్ల ఎదిగాయి.
ఆఫ్రికాలో:
- నాణ్యమైన విద్యా సంస్థలు తక్కువ
- సాంకేతిక నైపుణ్యాల లోపం
- పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాల కొరత
దీంతో యువత ఉన్నా, అవకాశాలు లేవు. సహజవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి నైపుణ్యం కావాలి. నైపుణ్యాన్ని సంపాదించాలంటే దానికి తగిన విద్య ఉండాలి. పాలకులు ఈ దిశగా ఆలోచిస్తేనే ఆఫ్రికా ఎదుగుతుంది.
వాతావరణం, వ్యాధులు కూడా అడ్డంకులే
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు:
- తీవ్ర ఎండలు
- ఎడారులు
- మలేరియా, ఈబోలా లాంటి వ్యాధులు తీవ్రంగా ఉంటాయి. ముడి వనరులే కాదు… జీవితాన్ని ఆగమాగం చేసే వైరస్‌లు కూడా ఆఫ్రికా నుంచే వస్తున్నాయి.
ఇవి వ్యవసాయం, ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీశాయి. అభివృద్ధికి ఇది కూడా ఒక పెద్ద అడ్డంకిగా మారింది.
చైనా పెట్టుబడులు – కొత్త అవకాశమా, కొత్త ఆధారపడటమా?
వీటన్నింటికంటే ప్రధాన సమస్య చైనా రూపంలో ఆఫ్రికా దేశాలు ఎదుర్కొబోతున్నాయి. ఇటీవల కాలంలో చైనా ఆఫ్రికాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రోడ్లు, రైళ్లు, పోర్టులు నిర్మిస్తోంది. కొంతమంది దీనిని అభివృద్ధి అవకాశంగా చూస్తున్నారు. మరికొందరు ఇది కొత్త కాలనీవాదం అని అంటున్నారు.
ఈ పెట్టుబడులు ఆఫ్రికా ప్రజల జీవితాలను మార్చుతాయా? లేదా మరోసారి అప్పుల బారిన పడేస్తాయా?
ఇది రాబోయే రోజుల్లో తేలాల్సిన ప్రశ్న.
ఆఫ్రికా భవిష్యత్తు ఇంకా రాయాల్సిన కథ
ఆఫ్రికా పేద, చీకటి ఖండం కాదు. ఆఫ్రికా శతాబ్దాలుగా దోపిడీకి గురౌతున్న ఖండం మాత్రమే. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. యువత ప్రశ్నిస్తోంది. వనరులపై హక్కు కోరుతోంది.
ఈసారి ఆఫ్రికా తన కథను తానే రాయగలదా? అది ప్రపంచం మొత్తం గమనిస్తున్న ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే వస్తుందని భావిద్దాం.