రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ తమారా లీజర్ సీఈవో సృష్టి శిబులాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించినట్లు సీఎం వివరించారు.
ఈ నిర్ణయం ద్వారా హోటళ్లు, రిసార్టులు, టూరిజం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడిదారులకు మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా కోనసీమ, అరకు లోయ, గండికోట వంటి ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, రిసార్టుల నిర్మాణంపై విస్తృతంగా చర్చ జరిగింది. అలాగే గోదావరి తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నదీ ఆధారిత పర్యాటక అభివృద్ధి అవకాశాలపై కూడా సమావేశంలో ప్రస్తావన వచ్చింది.
ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రకృతి వనరులు, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు వంటి అనేక బలమైన అంశాలు రాష్ట్రానికి ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటే పర్యాటకం ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు.
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రభుత్వం పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విధానపరమైన సౌలభ్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.