దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన తెలంగాణ విజన్–2047 లక్ష్యాలు, పెట్టుబడులకు అనుకూలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను సీఎం వివరించారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల సామర్థ్యాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్రంలో కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై టాటా గ్రూప్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ రంగంలో టాటా గ్రూప్ భాగస్వామ్యం ఉంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊపొస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
అలాగే హైదరాబాద్‌లోని క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. నగరంలోని స్టేడియాల అప్‌గ్రేడేషన్‌కు టాటా గ్రూప్ సహకారం అందించాలని కోరారు. అయితే ఈ అంశంపై టాటా చైర్మన్ కొంత సందిగ్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరోవైపు, హైదరాబాద్‌కు జీవనాడిగా భావిస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరిచిందని తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి రెండింటికీ ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సీఎం వివరించారు.
మొత్తంగా ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై సానుకూల చర్చలతో ముగిసింది.