భారతదేశం దేవతల భూమి. ఇక్కడ ప్రతి ఆలయం వెనుక ఒక కథ ఉంటుంది… ప్రతి శిల వెనుక ఒక రహసం దాగి ఉంటుంది. అలాంటి అంతుచిక్కని మర్మాలతో నిండిన పవిత్ర క్షేత్రమే త్రిపురలోని ఉనకోటి. ఒక ఆలయం కాదు… ఒక అద్భుత శిలా లోకం. నేటికీ పండితులను, పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న రహస్య క్షేత్రం ఇది.
ఉనకోటి అంటే “ఒక కోటి కన్నా ఒక్కటి తక్కువ” అనే అర్థం. అంటే 99 లక్షల 99 వేల 999 విగ్రహాలు. కొండలపై, అరణ్యాల మధ్య చెక్కిన వేలాది శిలా విగ్రహాలు ఒకే చోట కనిపించడం సాధారణ విషయం కాదు. ఈ విగ్రహాలన్నీ సహజంగా ఏర్పడ్డవా? లేక మానవ హస్తకళ ఫలితమా? అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు.
పురాణ కథనం ప్రకారం… ఒకసారి పరమశివుడు కోటి మంది దేవతలతో కలిసి ఎక్కడికో ప్రయాణం చేస్తుండగా రాత్రి అయింది. అందరూ ఒక చోట విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం శివుడు లేచి చూడగా, దేవతలంతా ఇంకా నిద్రలోనే ఉండిపోయారు. అది చూసి కోపగించిన మహాదేవుడు, “ఇక్కడే శిలలుగా మారండి” అని శపించాడట. అలా దేవతలందరూ రాతి రూపాల్లో నిలిచిపోయారని భక్తుల నమ్మకం.
మరో కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. కలు అనే మహా శిల్పకారుడు శివభక్తుడు. కైలాసానికి వెళ్లాలనే అతని కోరికను తెలుసుకున్న శివుడు, కలలో ప్రత్యక్షమై “ఒకే రాత్రిలో కోటి దేవతల విగ్రహాలను చెక్కగలిగితే నిన్ను కైలాసానికి తీసుకెళ్తాను” అని వరమిచ్చాడట. ఆ రాత్రంతా కలు విగ్రహాలు చెక్కాడు. కానీ ఉదయం లెక్కించేసరికి ఒక్క విగ్రహం తక్కువగా ఉందట. అలా ‘ఉనకోటి’ అనే పేరు వచ్చింది.
ఈశాన్య భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలో, అగర్తల నుంచి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం… శివలింగాలు, గణేశుడు, నంది, దేవతామూర్తులతో నిండిన ఓ ఆధ్యాత్మిక శిల్పవిశ్వం. కాలం మారినా, యుగాలు గడిచినా… ఉనకోటి రహస్యం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే నిలిచి ఉంది. భక్తులకు ఇది ఒక దర్శన స్థలం మాత్రమే కాదు… శివ మహిమకు మౌన సాక్ష్యంగా నిలిచిన అద్భుత క్షేత్రం.