దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత స్టీల్ దిగ్గజం అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లాలో నిర్మించబోయే అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను తొలి దశలోనే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర పరిశ్రమల రంగానికి గేమ్‌చేంజర్‌గా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.
స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన అనుమతులు, భూసేకరణ ప్రక్రియలను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని పనులు గడువులోపు పూర్తి అయితే, ఫిబ్రవరి 15 తర్వాత ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.