ఆస్కార్ వేదికపై భారతదేశం ఎన్నో ఏళ్లుగా కలగంటున్న ‘బ్లాక్ లేడీ’ ఆశ, 2026 ఆస్కార్ రేసులో ఫైనల్ స్టేజ్‌కు చేరుకునేలోపే ముగిసిపోయింది. ఈసారి భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక చిత్రం ‘హోంబౌండ్’, తాజాగా అకాడమీ ప్రకటించిన చివరి ఐదు నామినేషన్లలో చోటు దక్కించుకోలేకపోయింది.
ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వంలో రూపొందిన ‘హోంబౌండ్’, విషాల్ జెత్వా, ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్‌లకు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లింది. టాప్ 15 సినిమాల వరకూ చేరడంతో, భారతీయ సినీప్రియుల్లో చరిత్ర సృష్టిస్తామనే ఆశలు మళ్లీ చిగురించాయి.
ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’ తర్వాత బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ (ఇప్పుడు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్) కేటగిరీలో అంత దూరం వెళ్లిన సినిమా ఇదే కావడం విశేషం. కానీ ఫైనల్ ల్యాప్‌కు ముందు ఈ సినిమా ఆస్కార్ రేస్ నుంచి తప్పుకుంది.
దీని స్థానంలో కమిటీ ఈ ఐదు సినిమాలను ఎంపిక చేసింది –
బ్రెజిల్ నుంచి ‘ది సీక్రెట్ ఏజెంట్’,
ఫ్రాన్స్ నుంచి ‘ఇట్ వాస్ జస్ట్ అన యాక్సిడెంట్’,
నార్వే నుంచి ‘సెంటిమెంటల్ వాల్యూ’,
స్పెయిన్ నుంచి ‘సిరాత్’,
ట్యునీషియా నుంచి ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రాజాబ్’.
‘హోంబౌండ్’ కథ న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనంపై ఆధారపడింది. షోయబ్, చందన్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల ప్రయాణమే ఈ సినిమా కథ. పోలీస్ ఉద్యోగం సాధిస్తే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని నమ్మే ఈ ఇద్దరి కలల ప్రయాణం, 2021లో వచ్చిన కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సాగుతుంది. షోయబ్ పాత్రలో ఇషాన్ ఖట్టర్, చందన్ పాత్రలో విషాల్ జెత్వా నటించారు.
భారతీయ సినీ అభిమానుల నిరీక్షణ ఇంకా కొనసాగాల్సిందే. 2023లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ దక్కింది. అదే ఏడాది ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కూడా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా విజయం సాధించింది. కానీ ఇప్పటివరకు బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ సినిమా ఆస్కార్ అందుకోలేకపోయింది.
98వ అకాడమీ అవార్డ్స్ వేడుక మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. అక్కడే ఈ ఏడాది విజేతలను అధికారికంగా ప్రకటించనున్నారు.