‘ఓం శాంతి శాంతి శాంతిహి’ గ్రామీణ–కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూ వినోదంతో పాటు చమత్కారమైన హాస్యాన్ని అందించబోతున్న సినిమా. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ, ఈరోజు మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేయడం విశేషం.
ఈ కథ ఓంకార్ నాయుడు అనే చేపల వ్యాపారం చేసే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడు శాంతిని పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత ఓంకార్ చేసే ఎడతెగని మాటలు, అతని అహంకారం, తన ఆధిపత్యాన్ని చూపించాలనే ప్రయత్నాలు శాంతిని విసిగిస్తాయి. ఇక సహించలేక ఆమె ధైర్యంగా ఎదురుతిరిగి తన స్వాభిమానాన్ని కాపాడుకుంటుంది. దీంతో ఓంకార్ అహం పూర్తిగా దెబ్బతింటుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నంలో అతడు ముందుకు వస్తాడు కానీ ఆమె బలానికి ముందు నిలబడలేకపోతాడు.
తరుణ్ భాస్కర్ ఓంకార్ నాయుడు పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఈ పాత్ర ఆయనకు ప్రత్యేకంగా రాసినట్టే అనిపిస్తుంది. సహజమైన నటనతో హాస్యం పండించారు. ఈషా రెబ్బా శాంతి పాత్రలో స్వాభిమానంతో నిలబడే మహిళగా ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించబోతున్నారు.
దర్శకుడు ఏఆర్ సజీవ్ ఈ కథను గోదావరి ఎస్ట్యూరీ నేపథ్యంలో అద్భుతంగా మలిచారు. ప్రతి సీన్లోనూ ఆ ప్రాంతానికి చెందిన సహజత్వం, మట్టి వాసన స్పష్టంగా కనిపిస్తుంది.
సినిమాటోగ్రాఫర్ దీపక్ గోదావరి అందాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. జయ్ కృష్ణ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్‌కు మరింత బలం చేకూర్చింది. ఎస్ ఒరిజినల్స్ మరియు మూవీ వర్స్ స్టూడియోస్ నిర్మాణ విలువలు కూడా గొప్పగా కనిపిస్తున్నాయి.
మొత్తంగా ట్రైలర్ చూస్తే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. ‘ఓం శాంతి శాంతి శాంతిహి’ ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకానుంది.