ఇలా అరటి గెలలు కడితే చాలు… కోరిక ఇట్టే నెరవేరుతుంది

Banana Offering Ritual at Lakshmi Narasimha Swamy Temple

మనసులో కోరికతో దేవాలయానికి వెళ్లని భక్తుడు ఉండడు. ఎవరికైనా ఉద్యోగం రావాలని, మంచి వివాహం జరగాలని, పిల్లలు చదువులో రాణించాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ కోరికలను దేవుడి ముందు ఉంచి ముడుపులు కట్టడం భారతీయ సంప్రదాయంలో భాగం. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఒక చిన్న గ్రామ దేవాలయంలో మాత్రం భక్తులు ఎంతో విశ్వాసంతో అరటిగెలలను ముడుపుగా కడతారు. ఇదే ఇప్పుడు ఆ ఆలయ ప్రత్యేకతగా మారింది.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ స్వామివారికి అరటిగెల కట్టి మొక్కుకుంటే కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ ఆచారం కొత్తది కాదు. దాదాపు 80 సంవత్సరాలుగా గ్రామస్థులు, భక్తులు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ ఆలయంలోని రావిచెట్టువద్ద ప్రత్యేకంగా పందిళ్లు ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడే భక్తులు తమ మొక్కుల గుర్తుగా అరటిగెలలను కడతారు. కొందరు కోరిక నెరవేరాలని ముందుగానే కడితే, మరికొందరు కోరిక తీరిన తర్వాత కృతజ్ఞతగా సమర్పిస్తారు. ప్రతి ఏడాది సుమారు 10 వేలకుపైగా అరటిగెలలు స్వామివారికి సమర్పించబడుతున్నాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు ఈ ఆలయంలో భక్తుల రద్దీ అపారంగా ఉంటుంది. ఆ రోజును స్థానికులు “అరటిగెలల పండుగ”గా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే… స్వామివారికి కట్టిన అరటిగెలలను రెండు లేదా మూడు రోజుల తర్వాత భక్తులు ఇంటికి తీసుకెళ్లి ప్రసాదంగా పంచుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు వాటిని ఆలయానికే వదిలివెళ్తారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయం కలిసిన ఈ అరుదైన ఆచారం చెట్లతాండ్ర శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికే ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *