Mystery Ghost Temple in Himachal Pradesh Where Devotees Offer Cigarettes and Water
భారతదేశంలో అనేక ఆలయాలు తమ ప్రత్యేక ఆచారాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు కొండల మధ్య ఉన్న ఒక చిన్న ఆలయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే అక్కడ భక్తులు దేవుడికి పూలు, కొబ్బరికాయలు కాదు… సిగరేట్లు, మినరల్ వాటర్ బాటిళ్లు సమర్పిస్తారు. ఈ వింత సంప్రదాయం వల్లే “గాటా లూప్స్ ఘోస్ట్ టెంపుల్” ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మనాలి-లేహ్ జాతీయ రహదారిపై సముద్ర మట్టానికి సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. మంచుతో కప్పుకున్న కొండలు, ప్రమాదకర మలుపులు, చల్లని గాలుల మధ్య ప్రయాణించే వాహనదారులు ఈ ఆలయం వద్ద తప్పకుండా ఆగుతారు. అక్కడ ఒక నీళ్ల బాటిల్, ఒక సిగరెట్ సమర్పించి తర్వాతే ముందుకు వెళ్తారు. ఇలా చేస్తే ప్రయాణం సురక్షితంగా సాగుతుందని స్థానికుల విశ్వాసం.
ఈ ఆలయం వెనుక ఒక విషాదకథ దాగి ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక లారీ గాటా లూప్స్ వద్ద ప్రమాదానికి గురైందని చెబుతారు. ఆ సమయంలో లారీలో ఉన్న క్లీనర్ అక్కడే చిక్కుకుపోయాడట. డ్రైవర్ సహాయం కోసం వెళ్లినా, తిరిగి వచ్చేలోపే అతను దాహంతో ప్రాణాలు కోల్పోయాడని స్థానిక కథనం.
ఆ తర్వాత నుంచి అక్కడ రాత్రి వేళల్లో “దాహం… నీళ్లు…” అంటూ ఆత్మ తిరుగుతుందనే ప్రచారం మొదలైంది. దీంతో ప్రయాణికుల భయాన్ని తగ్గించేందుకు అక్కడ చిన్న ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి నీళ్లు, సిగరేట్లు సమర్పించడం ఆచారంగా మారిపోయింది.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు, బైకర్లు, ట్రక్ డ్రైవర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఆలయం వద్ద ఆగుతున్నారు. కొందరు దీనిని విశ్వాసంగా చూస్తే, మరికొందరు ఒక విచిత్ర అనుభూతిగా భావిస్తున్నారు. కానీ మంచు పర్వతాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ఈ ఆలయం మాత్రం ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తించడం మాత్రం నిజం.