వేడి రోజులు పెరుగుతున్న ఈ సమయంలో కూలర్లు, ఏసీలపై ఆధారపడటం తప్పనిసరిగా మారింది. కానీ విద్యుత్ బిల్లులు, పర్యావరణ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ సమస్యకు కొత్త పరిష్కారంగా సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు ఒక వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
సౌదీలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించిన ఈ సిస్టమ్‌కు “NESCOD” (No Electricity Sustainable Cooling On Demand) అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇది పూర్తిగా విద్యుత్ లేకుండానే చల్లదనాన్ని అందిస్తుంది.
ఈ టెక్నాలజీ అమ్మోనియం నైట్రేట్ అనే ఉప్పును నీటిలో కలిపే ఎండోథెర్మిక్ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో పరిసరాల నుంచి వేడి శోషించబడుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రత 25°C నుంచి కేవలం 3.6°C వరకు తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు. అంటే కొన్ని నిమిషాల్లోనే గదిలో గణనీయమైన చల్లదనం ఏర్పడుతుంది.
ఈ సిస్టమ్ రెండు దశల్లో పనిచేస్తుంది. మొదట ఉప్పు నీటిలో కరిగి చల్లదనాన్ని ఇస్తుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని సౌరశక్తి ద్వారా మళ్లీ ప్రాసెస్ చేస్తారు. సూర్యరశ్మి వల్ల నీరు ఆవిరైపోతుంది, మిగిలిన ఉప్పు మళ్లీ స్ఫటికాలుగా మారుతుంది. ఆ స్ఫటికాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇది ఒక రీఛార్జ్ చేయగల కూలింగ్ సిస్టమ్‌గా పనిచేస్తుంది.
ఈ టెక్నాలజీ ప్రతి చదరపు మీటరుకు సుమారు 191 వాట్ల వరకు శీతలీకరణ సామర్థ్యాన్ని అందించగలదని అంచనా. అంతేకాదు, ఆవిరైన నీటిని సేకరించి మళ్లీ శుద్ధి చేయవచ్చు. ఆ నీటిలో మలినాలు 1 PPM కంటే తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
విద్యుత్ లేని గ్రామాలు, ఎడారి ప్రాంతాలు, అలాగే కోల్డ్ స్టోరేజ్ అవసరాల కోసం ఇది పెద్ద మార్పు తీసుకురాగల టెక్నాలజీగా భావిస్తున్నారు. పర్యావరణానికి హాని లేకుండా చల్లదనాన్ని అందించే ఈ ఆవిష్కరణ భవిష్యత్ కూలింగ్ సిస్టమ్‌లలో కీలక పాత్ర పోషించవచ్చని నిపుణులు చెబుతున్నారు.