వంట మధ్యలో గ్యాస్ సిలిండర్ ఖాళీ అవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా పండుగలు, అతిథులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఇబ్బంది మరింత పెరుగుతుంది. అయితే గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ముందుగానే తెలుసుకునే సులభమైన మార్గం ఉంది. అదీ ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతోనే.
సిలిండర్ లోపల గ్యాస్ ద్రవ రూపంలో ఉండటంతో బయటకు కనిపించదు. అందుకే అది ఎప్పుడు అయిపోతుందో అంచనా వేయడం కష్టం. కానీ ఒక చిన్న టెక్నిక్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముందుగా ఒక కాటన్ గుడ్డను తీసుకుని నీటిలో బాగా తడపాలి. ఆ తర్వాత ఆ తడి గుడ్డతో సిలిండర్ మొత్తం చుట్టూ ఒకసారి తుడవాలి. తుడిచిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు వేచి ఉండాలి.
ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. సిలిండర్ పైభాగం త్వరగా ఆరిపోతుంది. కానీ కింద భాగం మాత్రం కొంతసేపు తడిగానే ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. సిలిండర్‌లో గ్యాస్ ఉన్న ప్రాంతం చల్లగా ఉంటుంది. అందువల్ల అక్కడ నీరు వెంటనే ఆరదు. గ్యాస్ లేని భాగం మాత్రం వేడిగా ఉండటంతో త్వరగా ఆరిపోతుంది.
దీనివల్ల సిలిండర్‌లో గ్యాస్ ఎంతవరకు ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, సిలిండర్‌లో 20% గ్యాస్ మాత్రమే మిగిలి ఉంటే, తడిగా కనిపించే భాగం కూడా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ముందుగానే గ్యాస్ స్థాయి తెలుసుకుని కొత్త సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
ఈ చిన్న చిట్కా గృహిణులకు చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి అలవాటు చేసుకుంటే గ్యాస్ అయిపోతుందనే భయం తగ్గుతుంది. సులభమైన ఈ పద్ధతి ద్వారా సమయానికి నిర్ణయం తీసుకుని వంట పనులను ఆపకుండా కొనసాగించవచ్చు.