భక్తి ఎలా ఉండాలి…భగవంతుడిని ఎలా దర్శించుకోవాలి… అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉండటం సహజమే. రోజూ ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది. ఓం నమశ్శివాయ…శివ రుద్రాయ.. అని చదువుతూ పూజచేస్తున్నా… మనసు మాత్రం…ఏమో రేపేం జరుగుతుందో… రావలసిన ధనం వస్తుందో రాదో… అబ్బాయికి ఉద్యోగం వస్తుందో రాదో… చాలా రోజుల నుంచి పారాయణ చేస్తున్నా…పూజలు చేస్తున్నా… ఎందుకో కలిసి రావడం లేదు అని మనసులో ఆలోచిస్తాం. ఇలాంటి భక్తితో మనం ఎన్ని రోజులు పూజలు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. భక్తి ఎలా ఉండాలి, స్వామిని బలంగా ఎలా పట్టుకోవాలి, ఒక్కసారి స్వామిని పట్టుకుంటే… ధనంవైపు, సమస్యలవైపు మనసు మరలుతుందా… తదితర సందేహాలన్నింటికి గతంలో ఎన్నో రకాలైన కథల రూపంలో సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు కూడా ఇలాంటి సందేహాలకు కన్నయ్య ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ పరమాత్ముడు ఓ చిన్ని కథద్వారా మన సందేహాలను తీర్చే ప్రయత్నం చేశాడు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
నిత్యజీవితంలో కన్నయ్యను సేవించడం, జీవనం కోసం పండ్లు అమ్ముకోవడం ఓ యువతి దినచర్య ఈవిధంగా ఉంటున్నది. ప్రతీరోజూ పండ్లు అమ్మే సమయంలో కన్నయ్య వస్తే బాగుండు… ఒక్కపండు ఆరగిస్తే బాగుంటుంది అనుకుంటూ వీధి వీధి తిరుగుతూ పండ్లు అమ్ముతుంటుంది. కన్నయ్య వస్తాడు..రావాలి…తన పండ్లు ఆరగించాలని అని రోజూ అనుకుంటూనే పండ్లు అమ్ముతుంది. ఎప్పటిలాగే ఒకరోజూ వీధి వీధి తిరుగుతూ పండ్లు అమ్ముతుండగా…వెనక నుంచి పండ్లు తాజాగా ఉన్నాయా అని ఓ చిన్నారి పిల్లవాడు అడుగుతాడు. ఆ చిన్నారిని చూడగానే పండ్లు అమ్ముకునే యువతి మంత్రముగ్ధురాలౌతుంది. వెంటనే తన బుట్టను కిందకు దించి ఆ పిల్లవాడిని ఒడిలో కూర్చొబెట్టుకొని ఒక్కొక్కటిగా తినిపిస్తుంది. యువతి పెడుతూ ఉంటే..చిన్నారి తినేస్తూ ఉన్నాడు. చివరకు బుట్టలోని పండ్లు మొత్తం అయిపోతాయి. ఒక్కపండు అడిగితే…మొత్తం పెట్టేశావే…నువ్వు భలేదానివే అని చమత్కారంగా అంటూ ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఆ యువతి ఏం మాట్లాడకుండా ఆ పిల్లవాడిని చూసిన ఆనందంలో మైమరచిపోయి అలానే కూర్చుండిపోతుంది. క్రమంగా సాయంత్రం అవుతుంది. సూర్యుడు పడమటి దిక్కునుంచి ఇంటికి చేరుకునేందుకు పరుగులు తీస్తున్నాడు. చంద్రుడు ఒళ్లువిరుచుకుంటూ ముఖప్రక్షాళన చేసుకొని బయటకు వచ్చాడు. అప్పటికిగాని ఆ యువతి సృహలోకి రాలేదు. అరే చీకటిపడే వేళయింది. త్వరగా వెళ్లాలి అని ఖాళీగా ఉన్న గంపను ఎత్తుకోబోయింది. ఖాళీ గంప బరువుగా మారిపోయింది. ఏంటి ఖాళీ బుట్ట ఇంత బరువుగా ఉంది అని అందులోకి చూసింది.
బుట్ట లోపల ఉన్నవాటిని చూసి తెల్లబోయింది. గంపలో బోలేడు వజ్రవైఢూర్యాలున్నాయి. వచ్చినవాడు పిల్లవాడు కాదు..కన్నయ్యే అని అర్ధం చేసుకొని పరవశించిపోయింది. కళ్లుమూసుకున్నా తెరిచినా కన్నయ్యే కనిపిస్తున్నాడు. ఆ సృహలోనే ఉంటూ చిరునవ్వులు నవ్వుకుంటూ ఆమె గంపను తలకు ఎత్తుకొని ముందుకు సాగింది. తన ఊరికి వెళ్లాలి అంటే మధ్యలో ఉన్న యమునను దాటాలి. అప్పటికే చీకటిపడింది. యుమునానది ఉదృతంగా ప్రవహిస్తోంది. యమునవైపు తేరిపారా చూస్తూ ఆనాడు వసుదేవుడు కన్నయ్యను ఎలాగైతే బుట్టలో పెట్టుకొని యమునను దాటాడో… ఇప్పుడు ఆ యువతి కూడా తన గంపలోని వజ్రవైడూర్యాలను యుమునలో పోసేసి..బుట్టను నెత్తినపెట్టుకొని నదిని దాటింది. తనకు కావలసింది రంగురాళ్లు కాదు… రత్నంలాంటి కన్నయ్య చాలు అనుకొని ఇంటికి చేరుకుంది. మన భక్తికూడా వజ్రవైఢూర్యాలపై కాకుండా…రత్నం లాంటి స్వామి చుట్టూనే ఉండాలి. ఆయన పక్కన ఉంటే చాలు…అన్నీ ఉన్నట్టే కదా.