అమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు తెలిసిన సలహాలు చెప్పి మనల్ని ఆ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. నవమాసాలు మోసి బిడ్డను కనడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మ రెండో జన్మ ఎత్తినట్టే. ఆడవారి జీవితం అంత కష్టంగా ఉంటుంది. ఆడ అంటే మనిషి మాత్రమే కాదు. ఈ సృష్టిలోని ఏ జంతువైనా సరే తన బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చచ్చి బతుకుంది. కొన్ని జంతువులు బిడ్డలను ప్రసవించే సమయంలో మరణిస్తుంటాయి. మనుషులకే కాదు అవసరమైతే జంతువులకు కూడా ఒక్కోసారి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయవలసి వస్తుంది. అటువంటి సంఘటన ఒకటి ఓ జూలో జరిగింది. ఆ సంఘటనకు ప్రతిరూపమే ఈ స్టోరి.
సెడ్గ్‌విక్ కౌంటీ జూ, అమెరికాలోని కాన్సాస్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ జంతుప్రదర్శనశాల, ఇటీవల ఒక హృదయస్పర్శమైన సంఘటనకు వేదికైంది. ఈ జూలో ఒక చింపాంజీ తల్లికి సీ-సెక్షన్ ద్వారా ఒక నవజాత శిశువు జన్మించింది. అయితే, ఈ చిన్న చింపాంజీ జననం తర్వాత శ్వాసకోశ సమస్యలతో బాధపడింది. దీని కారణంగా దానికి ఆక్సిజన్ సహాయం అవసరమైంది. జూ సిబ్బంది, వైద్య బృందం ఈ నవజాత శిశువు ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేశారు. ఈ ప్రక్రియలో, శిశువును కొంత సమయం తల్లి నుండి వేరుగా ఉంచి, ప్రత్యేక సంరక్షణలో ఉంచాల్సి వచ్చింది.
కొన్ని రోజులకు చింపాంజి పిల్ల కోలుకోవడంతో, దానిని తన తల్లి ఉండే ప్రాంతానికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. తల్లి కేజ్ బయట నుంచి లోపలికి వెళ్లి కూర్చున్నది. కొంత సమయం బుట్టలో ఉన్న చింపాంజి పిల్ల కదలడంతో… ఆ తల్లి పరుగు పరుగున వెళ్లి పిల్లను చేతుల్లోకి తీసుకొని ముద్దులు పెడుతూ కౌగిలించుకంది. తన హృదయానికి హత్తుకుంది. బిడ్డపై ఆ తల్లి చింపాంజి చూపిన ప్రేమను, ఆప్యాయతను చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నారు. తల్లిప్రేమకు మరుపురాని దృశ్యంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు భావవ్యక్తీకరణకు సాధ్యం కాదని, అనుభవపూర్వకంగా వ్యక్తపరచగలమని చెబుతున్నారు. తల్లికి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసిన తరువాత బిడ్డకు ఆక్సీజన్ అవసరం కావడంతో జూలోని ప్రత్యేక ఆసుపత్రిలో బిడ్డకు వైద్యులు చికిత్స అందించారు.
సెడ్గ్‌విక్ కౌంటీ జూ సిబ్బంది ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఇది చాలా మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ హృదయస్పర్శమైన క్షణం జంతువులలోనూ తల్లి-బిడ్డ బంధం ఎంత బలమైనదో, ఎంత పవిత్రమైనదో చూపించింది. ఈ సంఘటన జూ సందర్శకులకు మాత్రమే కాక, ఆన్‌లైన్‌లో వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ ఒక భావోద్వేగ అనుభవంగా మిగిలిపోయింది. ఈ చిన్న చింపాంజీ ఇప్పుడు తన తల్లి సంరక్షణలో ఆరోగ్యంగా కోలుకుంటోంది. ఈ సన్నివేశం చూసినపుడు మనకు అమ్మప్రేమ గుర్తుకు వస్తుంది. అమ్మకు దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది. అమ్మా అని నోరారా పిలవాలని అనిపిస్తుంది. అమ్మ ప్రేమకు, అనురాగానికి దూరంగా ఉండకండి. వృద్ధాప్యంలో వారిని వృద్దుల ఆశ్రమాల్లో ఉంచకండి. వయోభారం వారికి భారం కావొచ్చు. కానీ బిడ్డలకు కాదు. నేటి బిడ్డలే రేపటి వృద్ధులు అని మరువకండి.