వివాహం తరువాత నూతన వధూవరులు తప్పనిసరిగా సత్యానారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచరించాలి కూడా. ఇది సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కేవలం నూతన దంపతులే కాదు, ఇంట్లో ఏ పెద్ద శుభకార్యం జరిగినా అంటే గృహప్రవేశం వంటి శుభకార్యక్రమాలు నిర్వహించినపుడు ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలోనూ సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరిస్తుంటారు.
సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే . ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు , వ్రతాలు మరే మహర్షీ అందించలేదేమో. అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు . ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు . స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు . ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి , సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని సకల సౌభాగ్యాలూ వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పారు. పైగా సత్యనారాయణుడు అంటే, కేవలం విష్ణు స్వరూపము కాదు ! ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం . అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని
” మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః ” అని స్తుతిస్తారు.
ఇక, వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది . కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందుకు, ఆ సత్యనారాయణుని ఆసీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. అందువలనే, నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు