తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా దూకుడు పెంచుతున్నది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు, అధినేతల ఇంటిపోరుతో ఆ పార్టీ సతమతమవుతున్నది. తాజాగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోమని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత చామల కిరణ్‌కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని, గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి జీరో సీట్లు వచ్చాయని, రాజకీయంగా ఆ పార్టీ కనెక్టివిటీని కోల్పోయిందని అన్నారు. యూరియా ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతోందని ఎన్నికలు దూరంగా ఉన్నామని చెప్పడం పొంతన లేకుండా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలకు ప్రజలు గమనిస్తున్నారని, టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన గులాబీ పార్టీ ఆ తరువాత తెలంగాణ సెంటిమెంట్‌కు దూరంగా మారి బీఆర్ఎస్‌గా మారిపోయిందని, తెలంగాణ అనే అంశాన్ని ఆ పార్టీ మర్చిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ప్రజాస్వామ్యం గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని, ఆయనకు ఓటు వేయకపోవడం, ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంటులో లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా గుర్తించాల్సిన అవసరం లేదని చామల పేర్కొన్నారు. మరి చామల చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.