ఒక్కటిగా ఒకే పార్టీకోసం కష్టపడిన కుటుంబం… ప్రజల మన్నలను పొందిన కుటుంబ సభ్యులు. కాలంతో మారిన ఆలోచనలు… ఆ ఆలోచనలోనుంచి పుట్టుకొచ్చిన విబేధాలు…కలహాలు… కుటుంబంలో చీలికతో పాటు రాజకీయాల్లోనూ చీలికలు… పట్టుదలతో ఒకరు కృషిచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు పనిచేస్తే… తన కుటుంబానికి లైఫ్ ఇచ్చిన పార్టీకాదని కొంతకాలం బయటకు వెళ్లినా… ఆ తరువాత సొంత పార్టీలోకి తిరిగి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టి, మళ్లీ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి చేస్తున్న కృషి మరొకరిది. ఈ నేపథ్యంలో జరిగిన సంఘర్షణలు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యక్ష దాడులు… అన్నీ కలిపి రాజకీయం చదరంగంలో పావులుగా మారి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది అనుకుంటా… ఎవరి గురించి మాట్లాడుతున్నామో.
అవును… నిజమే… ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. వైఎస్ అందరివాడుగా పేరు తెచ్చుకుంటే, జగన్ ఏపీ సీఎంగా మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. పేద ప్రజలకోసం ఎన్నో రకాలైన పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్ అనుకోని కారణాల వలన రెండోసారి సీఎంగా ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ప్రతిపక్షానికే పరిమితమై ప్రజలతో మమేకం అయ్యేందుకు పావులు కదుపుతున్నాడు. ఇక రెండో ఎండ్‌లో ఉన్నదెవరో చెప్పక్కర్లేదు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించిన కొన్ని కారణాల వలన ఆమె తిరిగి ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రజలు పడుతున్న అవస్థలు, పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే…మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీపైనా, వైఎస్ జగన్‌పైనా విమర్శలు చేస్తున్నది. ప్రతిరోజూ మీటింగ్‌లు ఏర్పాటు చేసి యుద్ధాన్ని ప్రకటించినట్టుగా యుద్ధం చేస్తున్నది షర్మిల. కాగా, ఇప్పుడు తన అమ్ములపొదిలోనుంచి రాజారెడ్డి అనే మరో అస్త్రాన్ని బయటకు తీసింది షర్మిల. షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాజారెడ్డి తన తల్లి షర్మిలతో కలిసి ఈరోజు కర్నూలు జిల్లా ఉల్లిమార్కెట్ను సందర్శించారు. మార్కెట్ సందర్శనకు వెళ్లే ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ విజయమ్మ పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఒకవేళ రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చేమాట వాస్తవమే అయితే, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది కూడా చర్చనీయాంశమే. మామ జగన్ స్థానమైన పులివెందుల నుంచి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.