సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మదేవుడు అంటాం. సృష్టిలోని సకల ప్రాణులను సృష్టించింది బ్రహ్మదేవుడే. సృష్టించబడిన ప్రతి ప్రాణి నుదిటిపై తలరాతను రాస్తాడు. దానికి అనుగుణంగానే మనిషి జీవితం ఉంటుంది. తల రాతను మార్చుకోవాలని, కష్టపడితే తలరాత మారుతుందని అనుకొని కష్టపడుతుంటారు. ఎంత కష్టపడినా, ఎన్ని సాహసాలు, త్యాగాలు చేసినా తలరాత మారుతుందని అనుకోవడం పొరపాటే.
అయితే, తలరాత మారాలంటే తమిళనాడులోని ఆ ఒక్క దేవాలయానికి మాత్రమే సాధ్యమని పండితులు చెబుతున్నారు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన ప్రాంతం కావడంతో అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కష్టాలనుంచి గట్టెక్కించే ఆలయంగా తిరపట్టూరు ఈశ్వరాలయం ప్రసిద్ధి పొందింది. అబద్దం చెప్పిన బ్రహ్మదేవుడి శిరసును వీరభద్రుడు ఖండిస్తాడు.
సృష్టికర్త తన పదవిని కోల్పోయిన నేపథ్యంలో పశ్చాత్తాపంతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. భూలోకంలో 12 ప్రాంతాల్లో 12 శివలింగాలు ప్రతిష్టించాలని ఆదేశిస్తాడు. ఇందులో భాగంగానే బ్రహ్మదేవుడు తిరపట్టూరులో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన శివలింగానికి బ్రహ్మపురీశ్వరుడు అనే పేరు స్థిరపడింది. ఇక్క గర్బగుడిలో ఈశ్వరలింగంతో పాటు ఉత్తరం వైపున ధ్యానస్థితిలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. ఆ ఆలయంలో సోమవారం కంటే గురువారం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఈ ఆలయంలో ఏడు సంఖ్యకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఏడు సంఖ్యలో జన్మించిన వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహించినవారి సకల దోషాల నివారణ జరుగుతుందని, బ్రహ్మదేవుడి తలరాతను మార్చిన ఆలయం కావడంతో… ఈ ఆలయాన్ని దర్శించినవారి తలరాత మారుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ, కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని పండితులు చెబుతున్నారు. గ్రహదోషాలు, ఆరోగ్య దోషాలు, కుటుంబ బాధలు ఉన్నవారు తిరపట్టూరు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాలని చెబుతారు.