రాష్ట్రంలో రైతుల పరిస్థితి విషమంగా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. సగటున ప్రతి రైతు మీద 2 లక్షల అప్పు ఉందని, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. సంవత్సరానికి వెయ్యి మందికిపైగా రైతులు ప్రాణాలు తీసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు MSP లేకపోవడం, నష్టపరిహారం లేకపోవడం, సబ్సిడీ పథకాలు లేకపోవడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించిన ఆమె, “ప్రభుత్వం పూర్తిచేయాల్సిన కాలేజీలు ప్రైవేటు వారికి అప్పగించడం కుట్ర” అని వ్యాఖ్యానించారు. ఇలా చేస్తే పేద విద్యార్థులు చదువుకునే అవకాశం కోల్పోతారని, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చెప్పే “సూపర్ సిక్స్” పథకాలు వాస్తవానికి “సూపర్ ఫ్లాప్” అని విమర్శించారు. నిరుద్యోగులకు భృతి, మహిళలకు వాగ్దానాలన్నీ అమలు కాలేదని, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
తన కుమారుడు రాజారెడ్డి ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని, పెట్టకముందే YCP భయంతో స్పందిస్తోందని అన్నారు. “ఎన్ని కుక్కలు మొరిగినా నా కొడుకు YS రాజారెడ్డి నే” అని స్పష్టం చేశారు.
జగన్ పై విరుచుకుపడిన ఆమె, “YSR బ్రతికి ఉంటే జగన్ చేసిన పనులకి సిగ్గుతో తలదించుకునేవాడు” అన్నారు. BJP అభ్యర్థికి ఓటు వేసిన జగన్ RSS తో కలిసిపోయారని, ఇది YSR వారసత్వానికి అవమానమని పేర్కొన్నారు. “జగన్ మోడీకి దత్తపుత్రుడు, BJP కి తోక పార్టీ” అని విమర్శించారు.