పెళ్లైన ఆడవాళ్లు కాలి వేళ్లకు మెట్టెలు పెట్టుకుంటారు. మతాలతో సంబంధం లేకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. వివాహిత స్త్రీ అని గుర్తించేందుకు మెట్టెలే చిహ్నం. మెట్టెలు లేవు అంటే వివాహం కానివాళ్లు లేదా వైధవ్యం పొందిన వాళ్లు అని అర్ధం చేసుకుంటాం. అయితే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కాలికి మెట్టెలు వెండివి ధరించాలని అంటారు. వెండి చంద్రగ్రహానికి సంబంధించినవి. మనిషి జీవితంపై చంద్రుడి ప్రభావం ఉంటే ఆ మనిషి ఉన్నత స్థితికి చేరుకుంటాడు అనడంలో సందేహం లేదు. కాలి వేళ్లకు వెండితో తయారు చేసిన మెట్టెలు ధరించడం వలన ఆపాదమస్తకం శాంతి లభిస్తుంది. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు.
అయితే, ఈ మధ్యకాలంలో చాలామంది బంగారంతో తయారు చేసిన మెట్టెలను ధరించడం ఆనవాయితీగా మారింది. బంగారం శ్రీమహాలక్ష్మీ స్వరూపం. బంగారం పట్టీలు లేదా మెట్టెలు ధరించడం అంటే శ్రీమహాలక్ష్మీని అవమానించినట్టే అవుతుంది. ఇటువంటి వారి ఇంట ధనం ఉన్నప్పటికీ సుఖసంతోషాలు ఉండవని, ఆ ఇంట అనారోగ్యం తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు. నడుము నుంచి కాలివేళ్ల వరకు ఎక్కడా కూడా బంగారు ఆభరణాలను ధరించరాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.