లండన్‌లో టామీ రాబిన్సన్ ఏర్పాటు చేసిన “యునైట్ ది కింగ్డమ్” ర్యాలీ శనివారం హింసాత్మకంగా మారింది. ఈ ర్యాలీలో 1,10,000 – 1,50,000 మంది పాల్గొనగా, కౌంటర్ ప్రొటెస్ట్ “మార్చ్ అగెనస్ట్ ఫాసిజం”లో కేవలం 5,000 మంది మాత్రమే ఉండటం విశేషం. అయితే, పోలీసులు తెలిపిన ప్రకారం, రాబిన్సన్ అనుచరుల్లో కొందరు ఘర్షణలకు దిగడంతో 26 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. అందులో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న వారిలో 25 మందిని అరెస్ట్ చేశారు.
ఈ ర్యాలీని స్వేచ్ఛా హక్కుల కోసం అని ప్రకటించినప్పటికీ, వాస్తవానికి వలస వ్యతిరేక నినాదాలు ప్రధానంగా వినిపించాయి. పాల్గొన్నవారు “స్టాప్ ద బోట్స్,” “సెండ్ దెమ్ హోమ్,” “సేవ్ అవర్ చిల్డ్రన్” అనే బోర్డులు పట్టుకున్నారు. ఇంగ్లాండ్ జెండాలు, యూనియన్ జాక్‌లు ఊపుతూ “వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్” అని నినాదాలు చేశారు.
ఫ్రెంచ్ నేత ఎరిక్ జెమూర్ మాట్లాడుతూ యూరప్‌ను వలసదారులు భర్తీ చేస్తున్నారని, ఇది ఇలానే కొనసాగితో యూరప్ మొత్తం వలసదారులతోనే నిండిపోతుందని అన్నారు. ఇలాన్ మస్క్ కూడా వీడియో ద్వారా పాల్గొని బ్రిటన్ వలసల కారణంగా తన గుర్తింపును కోల్పోతుందని విమర్శించారు.
ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ చానల్ ద్వారా వలసదారుల రాక పెరగడం, ఆశ్రయం కోసం హోటళ్లలో నివసిస్తున్న శరణార్థులపై నిరసనలు జరగడం వంటి పరిణామాలు ఈ ర్యాలీ జరగడానికి ప్రధాన కారణంగా మారాయి. అంతేకాదు, వలసదారుల వచ్చినవారు స్థానికులపై చేయి చేసుకోవడం, వారిని హింసించడం వంటివి చేస్తుండటంతో వలసవాదులపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. వలసదారులను కంట్రోల్ చేయాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అయితే, అక్కడి చట్టాలు, ప్రభుత్వాలు తమ రాజకీయ పలుకుబడి కోసం వలసదారులను ప్రోత్సహిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, లండన్‌లో చేస్తున్న ర్యాలీ సాయంత్రం వరకు శాంతియుతంగా సాగినా… చివర్లో హింసాత్మకంగా మారింది. ర్యాలీలోకి జొరబడిన కొందరు ఆందోళన కారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారితో దురుసుగా వ్యవహరించడమే కాకుండా వారిపై చేయి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రాబిన్సన్ గతంలో కూడా అసాల్ట్, మోసం కేసులతో పాటు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి జైలుకు వెళ్లాడు. ఈసారి అతని ర్యాలీ అంచనాలకు మించిన జనాన్ని సమీకరించిందిగానీ, హింసతో వివాదాస్పదమైంది.