తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు థలపతి విజయ్ తన రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం (TVK)” తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని సెప్టెంబర్ 13, 2025న త్రిచిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సభకు భారీ సంఖ్యలు ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సభను చూసిన వారికి 1970లలో ఎంజీఆర్ రాజకీయ రంగప్రవేశాన్ని గుర్తు చేస్తుందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తిరుచ్చిలోని గాంధీ మార్కెట్ మైదానంలో విజయ్ మాట్లాడుతూ, ప్రస్తుత పాలక పార్టీ ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా భద్రతపై ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. “పారంపర్య రాజకీయాలకు ఇక ముగింపు పలకాలి. యువత ముందుకు రావాలి. ప్రజలకోసం కృషి చేసే శక్తి మాత్రమే భవిష్యత్తు,” అని విజయ్ గళమెత్తారు.
అయితే, విజయ్ సభలు, ఊరేగింపులకు పోలీసులు కఠినమైన నిబంధనలు విధించారు. అడుగడున అడ్డంకులు కల్పించారు. కానీ, విజయ్ అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. యువతతో పాటు మహిళలు కూడా అత్యంత భారీ సంఖ్యలో ఈ సభకు హాజరై విజయ్‌కు మద్దతు తెలిపారు. ఒపెనింగ్ సభనే హిట్టైతే… ఇక అసలు సినిమా ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరంభం అదిరినా రాబోయే రోజుల్లో రాజకీయాలు కఠినంగా ఉంటాయని విజయ్ తెలుసుకుంటాడని, ఎన్నికల సమయానికి చల్లబడతాడని కొందరు నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే టీవీకే పార్టీ ఇప్పటికే సుమారు 70 వేలకు పైగా బూత్ ఏజెంట్లను నియమించుకుంది. గ్రామీణ స్థాయిలోనూ, పట్టణాల్లోనూ తన శక్తిని చాటుకుంటోంది. సోషల్ మీడియా వేదికలపై విజయ్‌కి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోందని సమాచారం. ఈ ఉత్సాహం చూస్తుంటే 2026 ఎన్నికల్లో TVK శక్తివంతమైన ప్రత్యర్థిగా అవతరిస్తుందనే అభిప్రాయం నిపుణులది.
ప్రజలు గమనిస్తున్న అంశం ఏమిటంటే—విజయ్ తన సినిమా కెరీర్‌లోలాగే రాజకీయ రంగంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారా అన్నది. ఇప్పటివరకూ తారాజువ్వలా మెరుస్తున్న ఆయన, నిజంగా రాజకీయాల్లో శాశ్వత వెలుగుగా నిలుస్తారా ? అన్నదే ప్రధానమైన చర్చ.
మొత్తంగా చూసుకుంటే థలపతి విజయ్ రాజకీయ ప్రయాణం తమిళనాడు రాజకీయాల్లో కొత్త వాతావరణాన్ని తీసుకురావడమే కాక, యువతలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. DMK, AIADMK లాంటి పెద్ద పార్టీలు కూడా TVK పెరుగుతున్న ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి 2026 ఎన్నికల్లో ప్రజలు ఎప్పటిలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అవకాశం ఇస్తారా లేదంటే కొత్తగా ఆవిర్భవించిన టీవీకే వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే.