భక్తిభావం మనుషుల కంటే కూడా జంతువులకే ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి అవి భగవంతుడిని నమ్మితే చాలు… ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రార్థిస్తాయి. మనుషుల మాదిరిగానే అవసరమైతే గళ్లకు కూడా వస్తాయి. దీనికో ఉదాహరణే ఈ ఏనుగు. బందీపూర్ పులుల సంరక్షణ ప్రాజెక్టులో నివశించే ఈ అటవీ ఏనుగు ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి హిమవత్ వేణుగోపాల స్వామిని దర్శించుకొని వెళ్తుంది. అయితే, ఏనుగు రోజూ రావడం ఏమిటీ అంటే, కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు ఆ ఏనుగును ఆ వేణుగోపాల స్వామి రక్షించారని, అప్పటి నుంచి ఆయనపై ఉన్న కృతజ్ఞతా భావంతో ఏనుగు అలా వస్తూనే ఉంటుందని అంటారు.
నిత్యం ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు ఈ విషయం కొత్త కాకపోయినా, కొత్తగా ఆలయానికి వచ్చేవారు ఆ ఏనుగును చూసి భయపడి అరుస్తుంటారు. కానీ, అడవిలో తిరిగే ఏనుగే అయినప్పటికీ ఎవరినీ ఏమీ చేయడదని చెబుతుంటారు. మరి మీరెప్పుడైనా హిమవద్ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారా? మీ ఈ ఏనుగు తారసపడిందా లేదా… కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఒకవేళ మీరు హిమవద్ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే బెంగళూరు నుంచి 220 కిలోమీటర్లు లేదా మైసూరు నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఈ ఆలయం కొండపై ఉంటుంది. కొండమీదకు రెండు రకాలుగా చేరుకోవచ్చు. ఒకటి కాలినడకన, రెండోది ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో. కొండమీదకు ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఈ ఆలయం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.