పండుగల సందర్భంలో బస్సు టికెట్ చార్జీలు పెరిగాయన్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ ఖండించింది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు లేనని, కేవలం స్పెషల్ బస్సుల్లోనే జీవో నంబర్ 16 ప్రకారం చార్జీలు సవరించబడతాయని స్పష్టం చేసింది.
2003లో జారీ చేసిన జీవో ప్రకారం పండుగల సమయంలో నడిచే స్పెషల్ బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావడం వల్ల కనీస డీజిల్ ఖర్చులను భరించేందుకు మాత్రమే టికెట్ ధరలో 50% వరకు సవరణకు అనుమతి ఉంది. దీన్ని ఇప్పుడే కొత్తగా అమలు చేస్తున్నట్టు ప్రచారం చేయడం తప్పు అని తెలిపింది.
సంక్రాంతి, దసరా, బతుకమ్మ, రాఖీ, ఉగాది, వినాయక చవితి వంటి ప్రధాన పండుగల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు రోజుకు 500-1000 వరకు స్పెషల్ బస్సులు నడపబడతాయి. ప్రస్తుతం కూడా బతుకమ్మ, దసరా సందర్భంగా సెప్టెంబర్ 20, 27-30 తేదీలతో పాటు అక్టోబర్ 1, 5, 6న మాత్రమే స్పెషల్ బస్సుల్లో చార్జీల సవరణ అమల్లో ఉంటుంది.
టీజీఎస్ఆర్టీసీ వద్ద మొత్తం 10 వేల బస్సులు సేవలందిస్తున్నాయి. వీటిలో స్పెషల్ సర్వీసులకే సవరణ వర్తిస్తుంది, మిగతా రెగ్యులర్ బస్సుల టికెట్ ధరలు యథావిధిగా ఉంటాయని యాజమాన్యం స్పష్టం చేసింది.