అమెరికా ప్రభుత్వం తీసుకున్న హెచ్1 బీ వీసా ఫీజు పెంపు నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. చిన్న కంపెనీలు, స్టార్టప్ రంగాలతో పాటు పెద్ద కంపెనీలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. హెచ్1 బీ వీసాదారుల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇది ఒక్కసారి చెల్లించే ఫీజు కాదు. ప్రతి ఏడాది వీసాను రెన్యువల్ చేసుకునే సమయంలో ఈ మొత్తాన్ని తప్పకుండా చెల్లించాలి. ప్రతి ఏడాది లక్ష డాలర్లు ఫీజు కింద చెల్లిండం సాధ్యం కాదు.
హెచ్1 బి వీసా ద్వారా సాధారణంగా టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు అంతర్జాతీయ నిపుణులను రిక్రూట్ చేసుకుంటాయి. ఈ పద్దతిలోనే ఉద్యోగాలను పొందుతారు. ప్రతి ఏడాది కొంత మొత్తంలో ఫీజు చెల్లించి వీసా రెన్యువల్ చేయించుకోవడం పరిపాటి. కానీ, ట్రంప్ అమెరికా ఫస్ట్… అమెరికన్ల ఉద్యోగాలు కాపాడుతా అని చెప్పి ఎన్నికల సమయంలో వాగ్దానాలు, హామీలు ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏడాదికి లక్ష డాలర్లు చె్లలించడం అంటే సాధారణమైన విషయం కాదు. చిన్న కంపెనీలే కాదు, అటు పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ మొత్తాన్ని భరించి ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవు. వ్యక్తిగతంగా కూడా ఈ మొత్తాన్ని చెల్లించడం కూడా కష్టమే.
ఈ సమయంలో హెచ్1బి వీసాను సాధించడం దాదాపుగా ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు. ప్రతికూలంగా అనే కంటే అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీసా అంపశయ్యపై ఉందని, రేపోమాపో మరణించే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాలంటే… అధికారికంగా హెచ్1బి వీసాను ముగించే సమయం వచ్చేసింది. ట్రంప్ దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా అంటున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చెప్పడం ఇప్పటికిప్పుడు కష్టమే. కానీ, నాణ్యతతో కూడిన అంతర్జాతీయ నిపుణులు అమెరికాకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి చూపులు భారత్, చైనా, యూరప్ వంటి దేశాలపై ఉండే అవకాశం ఉంది. భారత్, చైనా నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్లేవారు ఇకపై వారి సొంత దేశాల్లోనే పనిచేసేందుకు అవకాశాలు ఏర్పడతాయి. భారత్ ఆర్మనిర్భర్ పేరుతో సరికొత్త యాగాన్ని మొదలుపెట్టింది. ఈ యాగంలో నిపుణులు కూడా తోడైతే మరింత ముందుకు దూసుకెళ్తుంది. వదలవోయి భారతీయుడా… అమెరికా కలను వదలవోయి భారతీయుడా… సొంత దేశముండగా…పరాయి దేశమెందుకురా… దేశాభివృద్ధి బాటకు సాయమవ్వరా… అని పాడుకుంటూ మనం కూడా మనదేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం.