జీవతమనే ప్రయాణంలో ఎందరో ప్రయాణికులు ఎదురౌతుంటారు. వారి నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటుంటాం. మంచివో చెడువో… మనపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. అయితే, గీతలో కన్నయ్య చెప్పినట్టుగా ఏం జరిగినా మనం సాక్షిగా మాత్రమే ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి వ్యక్తుల మధ్యనున్నా మన జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవితం ఒక దిశలో సాగాలి అంటే మనకు స్పూర్తినిచ్చే కొన్ని మాటలను మనం తెలుసుకోవాలి. ఆ మాటలేంటో ఇప్పుడు చూద్దాం.
చూడటానికి అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే, అవకాశం ఇంకొకరిది.
మన ప్రవర్తన ఆలోచనా విధానమే మనల్ని వ్యక్తి నుంచి శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది.
చులకనగా చూసే చోట చొరవ చూపకు. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకుండా ఉండూ.
ఆవేశంతో పలికిన మాటలు అయినవారిని పరాయివారిగాను, ఆలోచనతో మాట్లాడిన పలుకులు పరాయివారిని అయినవారిగాను మారుస్తాయి.
కళ్లు మసకగా కనిపిస్తే కళ్లని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ, అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవలసింది అంతరంగాన్ని.
తన మీద తనకు విశ్వాసం కలిగిన వ్యక్తి బలవంతుడు. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి బలహీనుడు.