తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) దేశంలోనే తొలిసారిగా ప్రజా రవాణా రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని ప్రారంభించింది. హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీ సహకారంతో సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.
సిబ్బంది పనితీరు మెరుగుదల, ఆరోగ్య పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను ప్రజానుకూలంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. మొదట పైలట్‌గా ఆరు డిపోల్లో అమలు చేసిన ఏఐ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ప్రస్తుతం అన్ని డిపోల్లో విస్తరించారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లో భాగంగా 40 వేలమంది సిబ్బంది ఆరోగ్య డేటాను ఏఐ, మెషిన్ లెర్నింగ్ సహకారంతో విశ్లేషిస్తున్నారు.
త్వరలోనే ఏఐ ఆధారిత ఆటోమెటిక్ షెడ్యూలింగ్ ప్రారంభించనుంది. రోజు, తిథి, పండుగలు, వారాంతాలు వంటి సందర్భాల్లో రద్దీని అంచనా వేసి, తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సంస్థలో ప్రత్యేక ఏఐ టీంను ఏర్పాటు చేసి, అధికారులకు హన్స ఈక్విటీ శిక్షణ అందిస్తోంది.
హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రెజెంటేషన్‌లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎండీ వీసీ సజ్జనర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2021 నుంచి అమలు చేస్తున్న స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ (ఎస్డీపీ)లో భాగంగానే ఏఐ ప్రాజెక్ట్ కొనసాగుతోందని అధికారులు వివరించారు.
ఏఐ వినియోగం ద్వారా సేవల్లో వేగం, కచ్చితత్వం, స్పష్టత పెరుగుతాయని, రవాణా రంగంలో దేశానికి మోడల్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని ఎండీ సజ్జనర్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు, హన్స ఈక్విటీ ప్రతినిధుల కృషిని అభినందించారు.