థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని వజీరా ఆసుపత్రి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా ఓ భారీ సింక్‌హోల్ ఏర్పడింది. 50 మీటర్ల లోతుతో, 30 మీటర్ల పొడవు వెడల్పుతో కూడీన ఈ భారీ సింక్ హోల్ ఏర్పడటంతో రహదారి లోపలికి కుంచించుకుపోయింది. రోడ్డు కింద ఏర్పాటు చేసిన మురుగునీరు పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. దీంతో అధికారులు అప్రమత్తమై సింక్ హోల్ సమీపంలో ఉన్న భవనాలు ముఖ్యంగా వజీరా ఆసుపత్రి, పోలీస్ స్టేషన్‌ను అత్యవసరంగా ఖాళీ చేయించారు. ఆసుపత్రిలోని రోగులను, సిబ్బందిని, స్థానికులను మరో ప్రాంతానికి తరలించారు.
సింక్‌హోల్ ప్రాంతం చుట్టూ పోలీసులు కంచెలు ఏర్పాటు చేశారు. ప్రజలను సింక్ హోల్ నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అసలు ఈ ప్రాంతంలో హటాత్తుగా సింక్‌హోల్ ఎలా ఏర్పడింది అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఇది భూగర్భజలాల క్షీణత, మట్టి బలహీనత లేదా నిర్మాణ పనుల ప్రభావం వలన జరిగి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పట్టణ ప్రాంతాల్లో సంభవించడం ఆందోళన కలిగించే అంశమని అధికారులు చెబుతున్నారు. రహదారి మధ్యలో ఇలా సింక్‌హోల్ ఏర్పడటం వలన భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం సమయంలో ఈ సంఘటన జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
అయితే, సింక్‌హోల్ కారణంగా భూగర్భంలో ఇంకా పగుళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సింక్‌హోల్స్ మనం పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. భూమిలో ఒత్తిడి పెరిగినపుడు, మట్టి నాణ్యత తగ్గిపోయినపుడు, పరిమితికి మించి నిర్మాణాలు ఒకేచోట్ల నిర్మితమైనపుడు దాని కారణంగా వచ్చే ఒత్తిడి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై పడుతుంది. తద్వారా పైనున్న మట్టి భూమిలోపలికి లాగబడుతుంది.