శరన్నవరాత్రుల్లో నాలుగోరోజున దుర్గాదేవి కాత్యాయనీ దేవి అవతారంలో దర్శనం ఇస్తున్నారు. 2016 తరువాత మరోసారి కాత్యాయనీ రూపంలో అమ్మవారు దర్శనమివ్వడం విశేషంగా భావిస్తున్నారు. కాత్యాయనీదేవి మహర్షి కాత్యాయనుని కటాక్షంతో అవతరించి, అసురరాజు మహిషాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించిన మహాదేవతగా పూజించబడుతున్నది.
కాత్యాయనీ దేవి అవతారం స్ట్రీ శక్తికి ప్రతీకగా చెబుతారు. అజ్ఞానం, పాపం, దోషాల నుంచి రక్షించి ధైర్యం, విజయం, ఐశ్వర్యం ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మంచి జీవిత భాగస్వామికోసం భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. వివాహం ఆలస్యమవుతున్న వారికి కుటుంబ శాంతి కోసం ఆశిస్తున్నవారికి అమ్మవారి పూజ ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. కాత్యాయనీదేవిని ఆరాధించడం వలన అభయప్రాప్తి, శారీరక మానసిక శక్తి, శతృవిజయం, సద్గతి లభిస్తాయని చెబుతున్నారు. అమ్మవారిని పసుపు రంగు పువ్వులు, నువ్వుల నైవేద్యంతో పూజిస్తే అమ్మవారు సులభంగా ప్రసన్నమవుతారని శాస్త్రోక్తం. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే కాత్యాయనీదేవి అనుగ్రహాన్ని తప్పకుండా అందిస్తుందని అంటారు.