కర్ణాటకలో వేలాదిమంది విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆల్ కర్ణాటక స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ధారవాడ వీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 34 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తి చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కర్ణాటక రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలు వాయిదా పడటంతో నిరుద్యోగుల్లో ఆందోళనల మొదలైంది. శారీరక పరీక్షలను 2025 చివరినాటికి నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుంది. నిరుద్యోగుల భవిష్యత్తు చీకటిలో మగ్గుతోందని ఆందోళనకారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ నిరుద్యోగిత రేటు 15 నుంచి 20 శాతం వరకు పెరిగిందని, ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడం అన్యాయమని నిరసనకారులు పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండగా, దానిని 28 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ, ఆ వాగ్దానం ఇప్పటి వరకు నెరవేర్చలేదని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ర్యాలీని నిరుద్యోగులు శాంతియుతంగా నిర్వహించారు. తమ గొంతును ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యమని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తమ అభిమతం కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి యువశక్తి అవసరం ఎంతో ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్యం భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.