తమిళ స్టార్ హీరో సూర్యా – జ్యోతికల కూతురు దియా సూర్యా సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆమె తెరకెక్కించిన తొలి షార్ట్ ఫిల్మ్ ‘లీడింగ్ లైట్’ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కి సూర్యా – జ్యోతికల ప్రొడక్షన్ హౌస్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ వెన్నుదన్నుగా నిలిచింది.
మొత్తం 13 నిమిషాల నిడివి గల ఈ డాక్యూ-డ్రామా బాలీవుడ్ లో లైటింగ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న మహిళల గురించి చెబుతుంది. సాధారణంగా సినిమాల్లో లైటింగ్ పనిని పురుషులు చేస్తారు. అయితే ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మహిళలు ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు, వారి పట్టుదల, సాధించిన విజయాలనే లీడింగ్ లైట్ చూపిస్తుంది.

ఈ చిత్రంలో ఈ రంగంలో ముందడుగు వేసిన ముగ్గురు మహిళా గాఫర్స్ — హెటల్ డెద్దియా, ప్రియాంక సింగ్, లీనా గంగుర్డే — తమ ప్రయాణాన్ని పంచుకున్నారు. శారీరకంగా, భావోద్వేగపరంగా ఎంత కష్టమో, ఆ అడ్డంకులను ఎలా అధిగమించారో వారు వివరించారు.
ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ రెజెన్సీ థియేటర్ లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్ లో ప్రదర్శింపబడుతోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్క్రీనింగ్ జరుగుతుంది. దీంతో 2026 ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీకి ఈ చిత్రం అర్హత సాధించింది.
తమ కూతురి ప్రతిభపై గర్వపడుతూ సూర్యా – జ్యోతికలు స్పందిస్తూ, “మా కూతురు తెరకెక్కించిన ఈ లీడింగ్ లైట్ చిత్రం, బాలీవుడ్ మహిళా గాఫర్స్ జీవితాన్ని వెలుగులోకి తెచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం” అని తెలిపారు.