విజయదశమి అంటే విజయం సాధించిన రోజు. ఈరోజు చేపట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతారు. అందుకే ఈరోజున కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతారు. అంతేకాదు, దసరా రోజున రావణ దహనం కూడా నిర్వహిస్తారు. వీటితో పాటుగా ఈరోజు తప్పకుండా చేయవలసిన మరోపని పాలపిట్ట దర్శనం. దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటే ఏడాది అంతా శుభాలు కలుగుతాయని, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా చిటికెలో పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. అసలు ఈరోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకుందాం.
ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ద్వాపరయుగంలోని పాండవుల కాలానికి వెళ్లాలి. పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకొని విజయదశమి రోజు శమీ వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని హస్తినాపురం వైపు పయనమౌతారు. ఆ సమయంలో వారికి పాలపిట్ట దర్శనం ఇస్తుంది. ఆ పాలపిట్టను చూసి నమస్కరించుకున్న పాండవులకు అక్కడి నుంచి ప్రతీచోట విజయం లభిస్తుంది. కురుక్షేత్రంలోనూ కౌరవులపై విజయం సాధిస్తారు. ఇలా శుభాలను కలిగించే కల్పవల్లి పాలపిట్ట కావడంతో విజయదశమి రోజున తప్పకుండా పాలపిట్టను చూడాలని చెబుతారు. పాలపిట్ట ఎవరు అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే అని అంటారు. 10 రోజులపాటు అమ్మవారిని ఎవరైతే నిష్టతో పూజిస్తారో, ఎవరైతే మనస్పూర్తిగా అమ్మను నమ్ముతారో వారికి పాలపిట్ట తప్పకుండా దర్శనం ఇస్తుంది. ఎవరికైతే పాలపిట్ట దర్శనం ఇస్తుందో వారి జీవితంలో ఎటువంటి లోటు ఉండదని అంటారు. అందుకే పాలపిట్ట దర్శనం కోసం ఈరోజు ప్రజలు తోటలు, అడవుల బాట పడతారు.