భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో తాము క్షమాశీలతను చూపించామని, ఇకపై అటువంటి క్షమాశీలతను తాము ప్రదర్శించబోమని తెలిపారు. ప్రపంచ భౌగోళిక పటంపై పాకిస్తాన్ కొనసాగాలంటే అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి అందిస్తున్న సహకారాన్ని వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. అలా కాకుండా ఉగ్రవాదులకు ఊతం ఇస్తూ… భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోలాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు.
ఆర్మీచీఫ్ జనరల్ ద్వివేది మాటల్లో చాలా అర్ధాలున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ది చెప్పినప్పటికీ ఆ దాడి కొన్ని పరిమితులకు లోబడి జరిగింది. పరిమితులను దాటకుండా ఆపరేషన్‌ను ముగించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. భవిష్యత్తులో మరోసారి పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ను చేపట్టవలసి వస్తే… పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆపరేషన్ సింధూర్ తరువాత కూడా పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శిభిరాలను ఏర్పాటు చేసి భారత్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. భారతదేశానికిగాని, ప్రజలకుగాని ముప్పు వాటిల్లితే సహించేది లేదని, ఈసారి మరింత గట్టిగా బుద్ది చెబుతామని అన్నారు.