అరకు కాఫీకి లభించిన జాతీయ స్థాయి గుర్తింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇటీవల బిజినెస్ లైన్ ప్రకటించిన చేంజ్ మేకర్ అవార్డును గిరిజన సహకార సంస్థ (GCC) అందుకుంది. ముఖ్యమంత్రి ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, అరకులో కాఫీ సాగు గిరిజనుల జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పేర్కొన్నారు.
శనివారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు అందుకున్న అవార్డు, ప్రశంసా పత్రాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక బ్రాండ్‌గా నిలిచిందని, దాని స్వచ్ఛత, సువాసన, ప్రత్యేక రుచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయని అన్నారు.
మంత్రి సంధ్యారాణి వివరించిన ప్రకారం, జీసీసీ–టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందంతో దేశంలో తొలిసారిగా ఆర్గానిక్ సాల్యూబుల్ కాఫీ ఉత్పత్తి కానుంది. అలాగే, నర్శిపట్నం సమీపంలోని మాకవరపాలెంలో ఏర్పాటు చేయబోయే ఆధునిక ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా “బీన్ టు కప్” మోడల్ రూపుదిద్దుకోనుందని తెలిపారు.