హైదరాబాద్ నగరంలో ప్రయాణించే సిటీ బస్సుల్లో చార్జీలను పెంచుతూ ఆర్టీసి నిర్ణయం తీసుకున్నది. కనీస చార్జీలపై 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన చార్జీలు ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకుగాను రూ. 5, నాలుటో స్టేజీ నుంచి అదనంగా రూ. 10 రూపాయలు వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఎలక్ట్రికల్ ఏసీ బస్సుల్లోనూ ఇదే రేటు వర్తించనుంది.
ప్రస్తుతం రూ.10గా ఉన్న మొదటి స్టేజ్ చార్జీ ఇకపై రూ.15 కాగా, నాలుగో స్టేజీ నుంచి రూ.20 బదులు రూ.30కి పెరిగింది. అంటే ప్రతి ప్రయాణికుడి జేబు నుంచి అదనంగా కనీసం రూ.5 నుంచి రూ.10 వరకు ఖర్చు కావాల్సి వస్తుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ పేర్కొంది. అయితే ఆదాయం తగ్గి, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఛార్జీలు పెంచక తప్పలేదని సంస్థ స్పష్టం చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్లో 2,800 బస్సులు రోజుకు 30,000 ట్రిప్పులు నడుపుతున్నాయి. 25 డిపోలు, 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. త్వరలో మరో 275 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. 2027 నాటికి మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులను సర్వీసులోకి తీసుకురావాలని ప్రణాళిక. దీనికోసం 19 డిపోలలో హెచ్టీ కనెక్షన్లు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.392 కోట్ల వ్యయం అవసరమని అధికారులు తెలిపారు.
అయితే ఈ నిర్ణయం సాధారణ ప్రయాణికులపై పెద్ద భారమైందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మహాలక్ష్మి ఉచితం అంటూ ఒక వైపు సంతోషం, మరో వైపు చార్జీలు పెరగడం నిరాశ కలిగిస్తోంది” అని వారంటున్నారు.