అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ ప్రతి అంశాన్ని ఆర్థికవిషయాలతో ముడిపెడుతున్నాడు. ప్రపంచదేశాలపై టారిఫ్‌లు విధిస్తూ ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్ టారీఫ్‌ల కారణంగా చాలా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని తెంచుకోవడానికి సిద్దమౌతున్నాయి. అమెరికాపై ఆధారపడటం తగ్గించి సొంత మార్గాలను అన్వేషిస్తున్నాయి. దీనికో ఉదాహరణ ఇండియా. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మొదట్లో ఉత్పత్తి రంగం పెద్దగా ముందుకు సాగలేదని అనుకున్నా… ట్రంప్ పుణ్యమా అని ఉత్పత్తి రంగంపై భారత్ ప్రధానంగా దృష్టిసారించింది.
ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతున్న ఇండియా ఇప్పుడు రక్షణ రంగంపై కూడా దృష్టి సారించి సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటోంది. ఇప్పటి వరకు ప్రయాణ విమానాలను అమెరికా కంపెనీల నుంచి కొనుగోలు చేసిన ఇండియా ఇప్పుడు సొంతంగా స్వదేశీయంగా విమానాల తయారీని మొదలుపెట్టింది. హెలీకాఫ్టర్లు కూడా భారత్‌లోనే తయారవుతున్నాయి. హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్లను కూడా చెన్నైలోనే తయారు చేస్తున్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ఇండియా పరోక్షంగా సహకారం అందిస్తోంది అన్నది ట్రంప్ వాదన. ఈ కారణంగానే భారత్‌పై పలు రకాలైన టారిఫ్‌లు విధిస్తూ వచ్చాడు. టారిఫ్‌ల కారణంగా దిగుమతి చేసుకునే వాటిపై అధికంగా సుంకాలు చెల్లించవలసి వస్తుంది. దీంతో అమెరికాతో తెగతెంపులు చేసుకోవడానికి ఇండియా సిద్దమౌతున్న తరుణంలో భారత్‌తో తిరిగి వాణిజ్యాన్ని పునరుద్దరించేందుకు ట్రంప్ సిద్దమౌతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధాన్ని కూడా ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగినట్టుగా చెబుతున్నారు. గాజా విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన 21 సూత్రాలతో పాటు టారిఫ్‌లు కూడా ప్రపంచ శాంతికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పడం విశేషం.
పూర్వం మాదిరిగా ఇప్పుడు ఏ దేశం కూడా అమెరికాపై ప్రత్యక్షంగా ఆధారపడటం లేదు. పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు మాత్రమే అమెరికాపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు హామాస్ ఇజ్రాయిల్ మధ్య శాంతికి ట్రంప్ టారిఫ్‌లు ఎలా మధ్యవర్తిత్వం వహించాయో అర్థంగాని విషయం. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ టారిఫ్ అనే ఒక కార్డు పట్టుకొని ప్రపంచదేశాలపై పెత్తనం చేయాలని చూడటం ఆశ్చర్యమనే చెప్పాలి.