Native Async

జోగులాంబ తలపై బల్లి… ప్రళయకాలంలో అమ్మవారే మార్గదర్శం

The Mystery of Jogulamba Devi Lizard on Goddess’s Head Symbolizes Creation and Destruction Power
Spread the love

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి జోగులాంబ ఆలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి దంతం పడిన చోటుగా చెబుతారు. ఇక్కడి అమ్మవారి నిజరూపాన్ని చూస్తే భయపడిపోతాం. అమ్మవారి జుట్టు జడలు కట్టినట్టుగా ఉంటుంది. ఈ జుట్టులో ఓ బల్లి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. అంతేకాదు, అమ్మవారు నగ్నంగా శవంపై కూర్చొని సాధన చేస్తున్న వృద్ధురాలిగా, మహా మాంత్రికురాలిగా కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూస్తే భయంకరంగా ఉంటుంది. అమ్మవారు కపాలమోక్షం ఇచ్చే ఆదిశక్తిగా చెబుతారు. కపాల మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడానికి అమ్మ ఒకచేత్తో కపాలన్ని పట్టుకొని ఉంటుంది. అమ్మవారినే బ్రహ్మరంధ్ర దేవత అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలానికి అధిదేవతగా అమ్మవారిని పూజిస్తారు. మనం జోగులాంబగా చెబుతున్న ఈ అమ్మవారి అసలు పేరు యోగులాంబ. యోగులకు తల్లిగా అమ్మవారిని పూజిస్తారు. ఈ యోగులాంబే కాలక్రమేణా జోగులాంబగా మార్పు చెందింది.

దేవాలయంలో బల్లులు అంటే మనకు గుర్తుకు వచ్చేది కంచి క్షేత్రమే. విష్ణుకంచిలో వెండి బంగారు బల్లులను మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు బల్లులు శ్రీమహావిష్ణువు రూపాలుగా చెబుతారు. అమ్మవారి జుట్టులో కూడా ఓ బల్లి ఉంటుంది. అమ్మవారిని గృహ చండీమాతగా పిలుస్తారు. అమ్మవారి విగ్రహం గర్భగుడిలో ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఆగ్నేయం అగ్నికి ప్రతిరూపం. అందుకే అమ్మవారు నిత్యం వేడిని జ్వలిస్తూ ఉంటారు. కోరపళ్లతో ఉగ్రస్వరూపిణిగా ఉంటుంది. ఈ సృష్టి అంతరించే సమయంలో బల్లి వలనే పునఃసృష్టి జరుగుతుందని, బల్లుల సంయోగం వలన ఏర్పడిన బల్లి గుడ్డు నుంచి విశ్వం తిరిగి సృష్టించబడుతుందని పండితులు చెబుతున్నారు. కంచిలోని రెండు బల్లులు కేవలం ప్రతిమలు మాత్రమే కాదు. అవి సజీవ రూపాలుగా ఉంటాయని అంటారు. వీటికి జీవశక్తిని జోగులాంబ అమ్మవారే ప్రసాదిస్తారన అంటారు. ప్రళయకాలంలో అమ్మవారి శక్తి వలన నీరంతా ఆవిరిగా మారిపోతుంది. అగ్నితో దహించిపోతుంది. ఆ సమయంలో బల్లి, తేలు, గబ్బిలం అనే మూడు జీవులు బతుకుతాయని, అదేవిధంగా బ్రహ్మకపాలంలో కూడా ప్రాణశక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ప్రళయకాలంలో మనం సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో విష్ణుకంచి వెళ్లి బల్లిని తాకుతారు. బల్లిని తాకడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. అమ్మవారి విగ్రహంలో కనిపించే తేలు శివ స్వరూపం. తేలు విష జంతువు. మహాశివుడు తన కంఠంలో విషాన్ని ఉంచుకున్నాడు. అదేవిధంగా గబ్బలం రక్తం తాగే క్షీరదం. అమ్మవారు రక్తబీజధారి. అందుకే గబ్బిలం అమ్మవారి స్వరూపంగా చెబుతారు. ఇక కపాలం బ్రహ్మదేవుడికి సంకేతం. బ్రహ్మదేవుడి ఐదవ తలను వీరభద్రుడు ఖండించగా అది బ్రహ్మకపాలంగా మారి ఆయన చేతికి అంటుకుంటుంది. దానిని విడిపించుకోవడానికి వీరభద్రుడు కాశీలో తపస్సు చేస్తాడు. బల్లి, తేలు, గబ్బిలం, కపాలం అనేవి విష్ణు, శివ, బ్రహ్మ స్వరూపం. అమ్మవారు ఈ ముగ్గురి శక్తిని తన తలలో ఇముడ్చుకున్నట్టుగా జోగులాంబ చరిత్రను చూస్తే అర్ధమౌతుంది.

అంటే బల్లి, తేలు, గబ్బిలం, కపాలం అనేవి విష్ణువు శివశక్తి బ్రహ్మ స్వరూపం అని తెలుస్తోంది కదా. అంటే జోగులాంబ అమ్మవారి ఈ నాలుగు శక్తి స్వరూప దేవతలను తన జటాధారి యందు ఈ జీవ రూపాలలో ఉంచి పునఃసృష్టికి కారకము అవుతుందని తెలుస్తోంది కదా. అయితే ఏ జీవి అయినా మోక్షాన్ని పొందవచ్చు. కానీ, తన బలహీనతలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటిని అధికమించాలి. మోక్షసాధన కోసం తీవ్రంగా శ్రమించాలి. బలహీనతలను జయించినపుడు అమ్మ జోగులాంబ ఆ సాధకుడికి మోక్షం ఇస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని అమ్మను ఆరాధించినవారికి కంటికి రెప్పలా కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. మన బలహీనతలను ముందుగా మనమే గుర్తించాలి. అరిషడ్‌వర్గాలను జయించే శక్తిని ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించాలి. ఈ ప్రార్థన మనసావాచాకర్మణ చేయాలి. అమ్మను నమ్మి పూనికతో పట్టుకోవాలి. అప్పుడే అమ్మ కరుణిస్తుంది. దయతో మనల్ని అనుగ్రహిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit