ధనతేరస్ పండుగ ముందు ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, బహిష్కరణ పిలుపులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఎం. పి. అహమ్మద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బ్రాండ్‌పై వ్యతిరేక వాతావరణం ఏర్పడడానికి కారణం, సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ షోరూమ్‌లో జరిగిన ఈవెంట్.
ఈ కార్యక్రమంలో పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ అలిష్బా ఖాలిద్ పాల్గొనడం వివాదానికి దారితీసింది. అలిష్బా గతంలో భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” వైమానిక దాడులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన విషయం బయటపడటంతో దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
భారతీయ సోషల్ మీడియా కార్యకర్త విజయ్ పటేల్ వంటి పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ విషయాన్ని ప్రస్తావించి, మలబార్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మలబార్ సంస్థ పటేల్‌పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది.
అయితే, సంస్థ తన వైఖరిని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. “అలిష్బా ఖాలిద్ మా బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఆమెతో ఉన్న అన్ని సంబంధాలను ముగించాం. సోషల్ మీడియాలో పాకిస్థాన్ అనుకూల సంస్థగా తమను ముద్రవేయడం బాధాకరం. దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. అదే విధంగా, సంస్థ బాంబే హైకోర్టు నుండి కూడా ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందిన “దూషణాత్మక పోస్టులు” తొలగించాలన్న ఆదేశాలు పొందింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #BoycottMalabarGold హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ 10 కంటే ఎక్కువ దేశాల్లో 300కి పైగా షోరూమ్‌లను కలిగి ఉన్న అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్ అయినప్పటికీ, ఈ వివాదం దీని ప్రతిష్టను తాత్కాలిక దెబ్బతీసింది.