అమావాస్య రోజున సహజంగా పితృకార్యాలను, మౌనాన్ని, నియమాలు పాటించండం, శ్రాద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే అమావాస్య రోజు అశుభకార్యాలకు ప్రసిద్ధి. కానీ, తెలంగాణలోని ఓ గ్రామంలో అమావాస్య రోజున పెళ్లిచూపులు… అదేరోజు సాయంత్రం వివాహం. అంతా అమావాస్య రోజునే జరుగుతుంది. దీని వెనుక వారి జీవన విధానమే కారణం.
ఆదిలాబాద్ జిల్లాలో నివశించే దండారి ఆదివాసులకు దీపావళి రోజున వచ్చే అమావాస్య అత్యంత శుభకరమైనదిగా భావిస్తారు. అది చీకటి కాదు… వారికి పంట చేతికి వచ్చిన ఆనందపు వెలుగుదినంగా చెబుతారు. అందరికీ సంక్రాంతికి పంట చేతికి వస్తే… ఇక్కడి ఆదివాసీలకు దీపావళికి పంట చేతికి వస్తుంది. గ్రామంలో సందడి నెలకొంటుంది. ధనం, ధాన్యం, ఉత్సాహం నిండిన క్షణాలు అవి. కష్టానికి తగిన ప్రతిఫలం చేతకి వచ్చిన సమయం. ఈ కారణంగానే గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వాతావరణంలోనే పెళ్లికి సన్నాహాలు చేసుకుంటారు. అమావాస్య అంటే అక్కడ శుభకాలం అని అర్థం. పనులు నిలిచిపోతాయి. లక్ష్మీపూజ చేసి సంపదను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. పశువులకు విశ్రాంతి దొరుకుతుంది. ఆరోగ్యపూజను నిర్వహిస్తారు.
దేవాలయాల్లో సంబరాలు మొదలౌతాయి. అంతేకాకుండా పెళ్లిచూపులు కూడా ఇదేరోజున నిర్వహిస్తారు. యువతీయువలకులు సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో, నృత్యాలతో, మొగే డప్పులతో గ్రామమంతా ఊరేగుతారు. వివాహానికి ముందు ఇరు కుటుంబ సభ్యులు వివరాలను మార్చుకుంటారు. కానీ, మొదటి చూపే నిర్ణయం కావడం, ఇది నిశ్చయమైతే అదేరోజు సాయంత్రమే వివాహం జరిపిస్తారు. వారంపాటు జరిగే దండారి ఉత్సవాల్లో డప్పుకళ, నృత్యాలు, గుస్సాడీ వేషాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఆ ఉత్సవాల్లో చివరిరోజు ఆనందోత్సాహాల మధ్య వివాహంతో ముగుస్తుంది. మనకు అమావాస్య చీకటే..కానీ ఆదివాసీలకు అది ప్రాణ సమానం. జీవన శుభారంభం. పటాకులు వెలిగే రోజే…పెళ్లిళ్లు కూడా జరగాలని అంటారు.