రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

సమావేశం లోని ముఖ్య అంశాలు:

  • అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం
  • అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం

అడవులు జాతీయ ఆస్తి, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయలకు తావుండదు. రాజీకి తావుండదు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం. గౌ|| ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అడవుల రక్షణ విషయంలో మార్గదర్శకం చేస్తున్నారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుంటే, నాడు అధికారులు ఎందుకు స్పందించలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని, పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యతను అటవీ అధికారులు తీసుకోవాలని చెప్పారు.

కృష్ణా జిల్లా కొండపావులూరులోని NDMA ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండు రోజుల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొని అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ శాఖలో విభిన్నమైన బాధ్యతలు పంచుకోవడానికి సరిపడినంత సిబ్బంది లేరని ప్రతి సమీక్షలోనూ అధికారులు నా దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ సమస్య అధిగమించడానికి ఉన్న మార్గాలను కేబినెట్ ముందు ఉంచాం. సిబ్బంది నియామకం వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలి. ఎలాంటి సిఫార్సులకు తావివ్వవద్దు. అడవుల్ని సంరక్షించాలంటే అటవీ శాఖ అధికారుల భద్రత ప్రధానమైనది. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతంగా నన్ను కలిసి సమస్యను చెప్పండి. శ్రీశైలం ఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నాను. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశాం. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి భయాలకు తావివ్వవద్దు.

రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు ఉన్నాయి. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చు అని అంచనా. అయితే ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపై సమగ్ర సర్వే చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలి. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా, చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దు. 2047 నాటికి రాష్ట్ర భూ భాగంలో 50 శాతం పచ్చదనంతో నిండేలా పని చేయాలి. దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరం. భావితరాలకు పచ్చదనాన్ని పెంపొందించేలా చైతన్యవంతులను చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం.

మానవులు – జంతువుల సంఘర్షణను అరికట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలి. రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అయిన చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మదపుటేనుగుల సంచారం ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో సమస్య పరిష్కారానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చాం. శ్రీకాకుళంలో తొమ్మిది ఆడ ఏనుగులు సంచరిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇవి ఒడిశా నుంచి వచ్చాయి. ఒడిశాలో మైనింగ్ పెరిగిపోవడంతో అవి ఇటు వైపు వలస వచ్చినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో అవి తిరుగుతున్న ప్రాంతం మొత్తం పంట పొలాలున్న ప్రాంతం. ఈ సమస్య పరిష్కారానికి అవసరం అయితే ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి వాటిని తిరిగి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటాం.

అడవుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, గిరిజనుల కోసం ఏదైనా చేయాలన్న తపన, నిబద్దతతో పని చేయాలని ముందుకు వచ్చే అధికారులకు కూటమి ప్రభుత్వం తరఫున మావంతు సహకారం అందిస్తాం. అడవులను కాపాడుకుంటూ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుంటూ పచ్చని హరితాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం” అన్నారు.

అంతకు ముందు ఎన్ఐఆర్డీలోని నక్షత్ర వనాన్ని పరిశీలించి ప్రతి మొక్క వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. జమ్మి చెట్టును నాటారు. ఈ వర్క్ షాప్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జున రావు, శాఖ ఉన్నతాధికారులు శ్రీ రాహుల్ పాండే, శ్రీమతి శాంతిప్రియా పాండే, ఎన్ఐఆర్డీ డైరెక్టర్ శ్రీ పి.ఎస్. రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ, ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *