మన పిల్లలు ఆదివారం వస్తే… తల్లిదండ్రులతో కలిసి టూర్‌కి వెళ్లడం లేదా సరదాగా సినిమాకో షికారుకో వెళ్లడం చేస్తుంటారు. కానీ, శ్రీనగర్‌కు చెందిన 14ఏళ్ల జన్నత్ పట్లూ మనందరికంటే ఢిఫరెంట్‌గా ఆలోచించింది. తన తండ్రికి ఉన్న బోటును తీసుకొని దాల్ సరస్సుకు వెళ్లి ఆ సరస్సును క్లీన్ చేస్తుందట. శ్రీనగర్‌కు ఈ సరస్సు ప్రాణం లాంటిది. ఎందరికో తిండి పెడుతున్నది. వేలాదిమంది టూరిస్టులు ఈ సరస్సులో బోటు షికారు చేసేందుకు వస్తారు. అటువంటి సరస్సును క్లీన్‌గా ఉంచుకోవడం ధర్మమని చెబుతోంది జన్నత్. ఓరోజు దాల్ సరస్సుతో తన తండ్రితో పాటు పనిచేస్తుండగా…ఓ విదేశీ పర్యాటకుడు సరస్సులో తేలుతున్న సిగరేట్‌ను తొలగించాడు. ఆ దృశ్యం చూసి జన్నత్ చలించిపోయింది.
తమకు అన్నంపెట్టే సరస్సును నాశనం కాకుండా కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఆదివారం రోజున తండ్రి అనుమతితో బోటు తీసుకొని సరస్సులోని చెత్తను తొలగిస్తూ వస్తోంది. జన్నత్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ సైతం మెచ్చుకోవడమే కాకుండా ఆమెను దాల్ సరస్సుకి గ్రీన్ అంబాసిడర్ అంటూ ప్రశంసించారు. అంతేకాదు, తెలంగాణ స్టేట్ సిలబస్‌లో మూడోతరగతి పాఠ్యపుస్తకాల్లో జన్నత్ జీల్ పేరుతో పాఠం కూడా ఉండటం విశేషం. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే సామెతను జన్నత్ అక్షరాలా నిరూపించింది.