చైనా ఇంజనీరింగ్ పనితనం మరోసారి ప్రపంచానికి చాటింది. 2019లో జియామెన్ అనే నగరంలో సుమారు 30000 టన్నుల బరువైన బస్‌స్టేషన్ భవనాన్ని ఒకేచోట స్థిరంగా ఉంచకుండా… 90 డిగ్రీల కోణంలో, 288 మీటర్ల దూరం వరకు జరుపుకునేలా డిజైన్ చేశారు. మీటర్ ముల్లు ఒకవైపు నుంచి మరో వైపుకు తిరిగినట్టుగా ఒక ఎండ్ నుంచి మరో ఎండ్ వరకు ఈ బస్‌స్టేషన్‌ను జరపవచ్చు. భవనంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్ని స్క్రాచ్ పడకుండా జాగ్రత్తగా కదిలించేందుకు వీలుగా నిర్మించారు. 2019లో నిర్మించిన ఈ కదిలే బస్‌స్టేషన్ గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.
సాధారణంగా ఒకచోట నిర్మించిన భవనాన్ని మరోచోటకు లేదా దాని ప్లేస్‌లో మరొకటి నిర్మించాలి అంటే ఎగ్జిస్ట్ భవనాన్ని కూల్చివేక తప్పదు. కానీ, జియామెన్ స్మార్ట్ అభివృద్దిలో భాగంగా పర్యావరణానికి ఇబ్బంది కలుగకుండా, భవనానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో వాకింగ్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ అనే ప్రత్యేకమైన సాంకేతికతను వినియోగించి కదిలే బస్‌స్టేషన్‌ను డిజైన్ చేశారు. భవన నిర్మించే సమయంలో దాని కింద సుమారు 200లకు పైగా హైడ్రాలిక్ రోబోటిక్ ఫుట్‌పాడ్స్‌ను అమర్చారు. వీటి సహాయంతో ఆ బిల్డింగ్ మొత్తం ఒక్కో అడుగు చొప్పున ముందుకు కదులుతుంది.
కొద్దిపాటి కదిలక ఏర్పడినా భవనం కూలిపోతుంది. కానీ, 30 వేల టన్నుల బరువును సమతుల్యం చేసుకుంటూ, అద్దాలు, కిటికీలు పగిలిపోకుండా, ఇనుమును ఉపయోగించిన ప్రాంతం వంగిపోకుండా సురక్షితంగా ఈ బిల్డింగ్‌ను ఒకచోట నుంచి మరో చోటకు మూవ్ చేస్తారు. ఈ బిల్డింగ్ ఒకచోట నుంచి మరో చోటకి మారడానికి కనీసం 25 రోజుల సమయం పడుతుంది. అయితే, ఇలా మూవింగ్ వలన ప్రభుత్వం ఖర్చు సుమారు 40 శాతం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.